యష్ టాక్సిక్.. విడుదల మళ్లీ వాయిదా?
ABN, Publish Date - Apr 29 , 2026 | 05:37 AM
యష్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యష్ (yash) కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’ (Toxic A Fairy Tale for Grown-Ups) మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కన్నడ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ చిత్రం మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా జూన్ 4కి వాయిదా వేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 4న కూడా సినిమా విడుదలయ్యేలా లేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కేడీ:ది డెవిల్’ సినిమా ఈ గురువారం రిలీజ్ అవుతోంది. దీని తర్వాతే ‘టాక్సిక్’ విడుదలపై నిర్మాణ సంస్థ దృష్టి సారించనున్నట్లు తెలిసింది. విడుదలలో జాప్యానికి మరో రెండు కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ డీల్ ఇప్పటి వరకూ పూర్తవలేదు. ఓ ఓటీటీ ప్లాట్‌ఫాం రూ.110 కోట్లు ఆఫర్ చేయగా నిర్మాణ సంస్థ తిరస్కరించినట్లు సమాచారం.
దాదాపు రూ.700 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఓటీటీ నుంచి కనీసం రూ.250 కోట్లను నిర్మాతలు ఆశిస్తున్నారు. దీంతో ఓటీటీ డీల్ విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక రెండో కారణం సెన్సార్ సర్టిఫికెట్. చిత్రానికి సంబంధించిన ఇంకా కొన్ని చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌లు పెండింగ్‌లో ఉన్నాయట. అందువల్ల నిర్మాణ సంస్థ ఇప్పటివరకైతే సెన్సార్ సర్టిఫికెట్‌కి దరఖాస్తు చేయలేదు. ఈ రెండూ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు కన్నడ చిత్రపరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సినిమా వాయిదాపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కన్నడ, తెలుగు సహా ఆరు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.