సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Drishyam 3: మలయాళంలో హిట్టు.. తెలుగులో ఫట్టు.. తప్పెవరిది

ABN, Publish Date - May 25 , 2026 | 11:05 AM

  సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు తిరుగుండదు. అలాంటి ఒక క్రేజీ కాంబినేషనే.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్.

 సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు తిరుగుండదు. అలాంటి ఒక క్రేజీ కాంబినేషనే.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్. వీరిద్దరి కలయికలో వచ్చిన దృశ్యం సిరీస్ సినిమాలు అందరికీ తెలుసు. ఆల్రెడీ వచ్చిన రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగించడమే కాకుండా.. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ అయి ఇక్కడి ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించాయి. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ నుండి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ దృశ్యం-3 విషయంలో మేకర్స్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం టాలీవుడ్‌లో కోలుకోలేని దెబ్బ తీసింది. ఒకవైపు మలయాళంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం.. తెలుగులో మాత్రం ఎందుకు డిజాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

నిజానికి 'దృశ్యం-3' అనౌన్స్ అయినప్పటి నుంచే తెలుగు ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి రెండు భాగాల తరహాలోనే.. మూడో భాగాన్ని కూడా వెంకటేష్‌తోనే తెలుగులో రీమేక్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఇక్కడే సీన్ రివర్స్ అయింది. విక్టరీ వెంకటేష్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లనో.. లేక ఈ  సిరీస్ పై ఆయనకు ఆసక్తి తగ్గడం వల్లనో స్పష్టత లేదు గానీ, తెలుగు రీమేక్ పట్టాలెక్కలేదు. దాంతో మేకర్స్ ఒక ప్రయోగం చేశారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన వర్షన్‌నే తెలుగులోకి డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేశారు. అయితే, ఈ స్ట్రాటజీ పూర్తిగా బెడిసికొట్టింది. ఒక సినిమా థియేటర్లలోకి వస్తుందంటే ఎంత హడావుడి ఉండాలి.. కానీ దృశ్యం-3 తెలుగు రిలీజ్ విషయంలో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదు. పోస్టర్లు లేవు, ప్రెస్ మీట్లు లేవు, టీజర్ లేదా ట్రైలర్ లాంచ్ లాంటి సందడులు అస్సలు లేవు. ఈ నిర్లక్ష్యం సినిమాకు అతి పెద్ద మైనస్‌గా మారింది. ఫలితంగా అసలు దృశ్యం-3 థియేటర్లలోకి వచ్చిందనే సంగతి చాలా మంది సాధారణ ప్రేక్షకులకు తెలియకుండానే పోయింది. థియేటర్లు ఖాళీగా దర్శనమివ్వడంతో ఇక్కడ సినిమా ఘోరమైన డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

అయితే ఇండస్ట్రీ వర్గాల్లో దీనిపై ఒక ఆసక్తికరమైన రూమర్ నడుస్తోంది. భవిష్యత్తులో ఎలాగైనా ఈ సినిమాను తెలుగులో పెద్ద ఎత్తున రీమేక్ చేయాలనే ఆలోచన మేకర్స్‌కు ఉందట. అందుకే, ఇప్పుడు డబ్బింగ్ వర్షన్‌కు పెద్దగా పబ్లిసిటీ చేయలేదనే ప్రచారం సాగుతోంది. కారణం ఏదైనా కావచ్చు.. తెలుగులో ఈ రేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఆడియన్స్ మిస్ అవ్వడం విచారకరం. కట్ చేస్తే.. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే, అటు ఓవర్సీస్‌లో.. ఇటు పాన్‌ ఇండియా వైడ్‌గా మాత్రం మోహన్ లాల్ తన విశ్వరూపం చూపించారు. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా 141 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. తెలుగులో ఫట్టయినా.. మలయాళంలో మాత్రం హిట్టు కొట్టి తన బ్రాండ్ వాల్యూను నిలబెట్టుకుంది 'దృశ్యం-3'. మరి భవిష్యత్తులో దృశ్యం-3ను తెలుగులో రీమేక్‌ చేస్తారేమో చూడాలి.

Updated Date - May 25 , 2026 | 11:34 AM