సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Aug 12 , 2026 | 11:07 AM

సినీనటి త్రిషను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమిస్తారో అంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

trisha

సినీనటి త్రిష (Trisha)పై అన్నాడీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ (RB Udhayakumar) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ నెల 8న తూత్తుకుడిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విజయ్‌కు ప్రియమైన త్రిషను ఉపముఖ్యమంత్రిగా (Deputy CM) ఎప్పుడు నియమిస్తారోనని తమిళనాడు ప్రజలు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీవీకే కార్యకర్తలు, త్రిష అభిమాన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఉదయకుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ మదురై జిల్లా వ్యాప్తంగా త్రిష అభిమాన సంఘాల ప్రతినిధులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో విజయ్‌తో సినీ సంబంధాలు ఉన్నవారికి ప్రభుత్వ పదవులు ఇవ్వడంపైనా ఉదయకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయ్ సినిమా తీస్తే ప్రభుత్వ పదవి ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. విజయ్ సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించిన వారికి, ఆయనతో వ్యాపార సంబంధాలు ఉన్నవారికి ప్రభుత్వ కమిటీల్లో పదవులు కల్పిస్తున్నారని ఆరోపించారు.

ఆలయాల ట్రస్టీల ఎంపిక కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీలో సినీ నిర్మాతకు అవకాశం కల్పించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇప్పటికే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ చిత్ర నిర్మాత, కర్ణాటకకు చెందిన వెంకట్ కె. నారాయణను ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. తాజాగా మరో సినీ నిర్మాత అర్చన కల్పాతికి ప్రభుత్వ కమిటీలో చోటు కల్పించారని పేర్కొన్నారు.

అలాగే ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా లియో చిత్ర సహ నిర్మాత జగదీష్ పళనిస్వామిని, తమిళనాడు ప్రభుత్వ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా బీస్ట్ చిత్ర కెమెరామెన్ మనోజ్ పరమహంసను నియమించారని ఉదయకుమార్ విమర్శించారు.ముఖ్యమంత్రితో సినిమా చేస్తే ప్రభుత్వ పదవులు దక్కుతాయనే పరిస్థితి తమిళనాడులో ఏర్పడిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దీంతో త్రిషపై చేసిన వ్యాఖ్యలతో పాటు విజయ్‌కి సంబంధించిన రాజకీయ నియామకాలపై ఉదయకుమార్ చేసిన విమర్శలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - Aug 12 , 2026 | 11:07 AM