తగ్గేదేలే అంటున్న విజయ్ సినిమా నిర్మాత
ABN, Publish Date - Feb 18 , 2026 | 12:45 PM
విజయ్, సమంత జంటగా నటించిన 'పోలీస్' చిత్రం జనవరిలో రీ-రిలీజ్ కావాల్సింది. కానీ అప్పుడు కాలేదు. తాజాగా ఈ సినిమా ఫిబ్రవరి 27న తమిళ, తెలుగు భాషల్లో రీ-రిలీజ్ చేస్తున్నారు.
స్టార్ హీరో విజయ్ (Vijay), టాప్ హీరోయిన్ సమంత (Samantha) జంటగా, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో కలైపులి థాను నిర్మించిన తమిళ చిత్రం ‘తెరి’. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ 'పోలీస్' (Police) పేరుతో డబ్ అయ్యి, ఘన విజయాన్ని సాధించింది. అయితే జనవరిలో విజయ్ సినిమా 'జన నాయగన్' విడుదల కాకపోవడంతో జనవరి 23న 'తెరి' (Theri) సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని నిర్మాత కలైపులి ఎస్ థాను భావించారు. కానీ ఆ సినిమా ఆరోజున విడుదలకు నోచుకోలేదు. అయితే తాజాగా ఫిబ్రవరి 27న ఈ సినిమాను రెండు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు.
'పోలీస్' చిత్రాన్ని నైజాం ప్రాంతంలో ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ ఫిలిమ్స్, ఆంధ్రాలో సురేష్ మూవీస్ భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రీ-రిలీజ్ వార్తతో సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుండగా, విజయ్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు మరోసారి ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండ్రి – కూతురు అనుబంధం, పోలీస్ బ్యాక్‌డ్రాప్, భావోద్వేగాలు, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవించి అట్లీ ‘పోలీస్’ చిత్రాన్ని రూపొందించారు. విజయ్ ద్విపాత్రాభినయంలో మెప్పించగా, సమంత పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే మరో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటించారు. ప్రభు, రాధిక శరత్ కుమార్ పాత్రలు కూడా ఈ చిత్రానికి కీలకం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) పాటలు అప్పట్లో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో మెరుగైన క్వాలిటీతో రీ-రిలీజ్ అవుతున్న ఈ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.