సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay: 'జన నాయగన్' బదులు 'పోలీస్'

ABN, Publish Date - Jan 17 , 2026 | 06:36 PM

విజయ్ హీరోగా నటించిన 'జన నాయగన్' సినిమా విడుదలలో జాప్యం జరగడంతో ఆ లోటును భర్తీ చేస్తూ 'తెరి' సినిమా రాబోతోంది. ఈ సినిమా తెలుగు అనువాదం 'పోలీస్'ను సైతం ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు.

Vijay Theri Movie

కోలీవుడ్ స్టార్ హీరో కమ్ పొలిటీషియన్ విజయ్ నటించిన 'జన నాయగన్' (Jana Nayagan) నిజానికి పొంగల్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ సి.బి.ఎఫ్.సి. (CBFC) ఛైర్మన్ రిలీజ్ కు మోకాలడ్డటంతో ఈ సినిమా నిర్మాతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సుప్రీమ్ కోర్టులోనూ నిర్మాతకు చుక్కెదురైంది. ఈ నెల 21లోపు హైకోర్టులోనే తేల్చుకోమని, తాము ఈ సమయంలో ఈ వ్యవహారంలో తలదూర్చలేమని సుప్రీమ్ కోర్టు తేల్చిచెప్పేసింది. దాంతో విజయ్ అభిమానులను నిరాశ చెందకుండా తన చిత్రం 'తెరి' (Theri) ని సంక్రాంతికి రీ-రిలీజ్ చేస్తామని నిర్మాత కలైపులి ఎస్ థాను ప్రకటించారు. కానీ ఇతర నిర్మాతల కోరిక మేరకు ఆయన ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాను జనవరి 23న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.


విశేషం ఏమంటే... గతంలోనే 'తెరి' సినిమా తెలుగులో 'పోలీస్' పేరుతో డబ్ అయ్యి విడుదలైంది. ఇక్కడ మించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమిళంతో పాటు దీనిని తెలుగులోనూ రీ-రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ (Vijay) సరసన ఇందులో సమంత (Samantha) నాయికగా నటించింది. అట్లీ (Atlee) దీనిని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ ఫిలిమ్స్, ఆంధ్రా లో సురేష్ మూవీస్ భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాయి. ఇప్పటికే రీ-రిలీజ్ వార్తతో సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుండగా, విజయ్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు మరోసారి ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


తండ్రి, కూతురు అనుబంధం, పోలీస్ బ్యాక్‌డ్రాప్, భావోద్వేగాలు, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవించి అట్లీ ఈ 'పోలీస్' చిత్రాన్ని రూపొందించారు. విజయ్ ద్విపాత్రాభినయంలో మెప్పించగా, సమంత పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే మరో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటించారు. ప్రభు, రాధిక శరత్ కుమార్ పాత్రలు కూడా ఈ చిత్రానికి కీలకం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ కుమార్ పాటలు అప్పట్లో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ 'పోలీస్' విజయ్‌కు తెలుగులో కూడా బలమైన అభిమాన వర్గాన్ని మరింత పెంచింది. ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో మెరుగైన క్వాలిటీతో రీ-రిలీజ్ అవుతున్న ఈ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్, సమంత అభిమానులకు ఇది నిజంగా తీపి కబురే!

Updated Date - Jan 17 , 2026 | 08:27 PM