తొలిసారి జత కడుతున్న విజయ్ సేతుపతి, సాయిపల్లవి!
ABN , Publish Date - Mar 20 , 2026 | 03:43 PM
విజయ్ సేతుపతి, సాయిపల్లవి తొలిసారి జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ తో కలిసి స్వీయ దర్శకత్వంలో మణిరత్నం నిర్మిస్తున్నాడు.
మణిరత్నం (Maniratnam) తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్'ను లైకా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించకపోయినా... గౌరవప్రదమైన విజయాన్ని అందుకుంది. అయితే మొదటి భాగమంత సక్సెస్ రెండో భాగానికి దక్కలేదు. అయినా ఇటు మణిరత్నం మద్రాస్ టాకీస్, అటు లైకా ప్రొడక్షన్స్ సంస్థలు మరో సినిమాను కలిసి నిర్మించబోతున్నాయి. గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన 'నవాబ్' మూవీలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్ర పోషించాడు.
ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. అలానే ఇప్పటి వరకూ సాయి పల్లవి (Sai Pallavi) మణిరత్నం సినిమాలో నటించలేదు. అంతేకాదు... విజయ్ సేతుపతి సరసన కూడా ఆమె నటించలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమాలో సాయిపల్లవి నాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు మణిరత్నం సాయి అభ్యంకర్ ను సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నాడంటూ మొన్నటి వరకూ కోలీవుడ్ కోడై కూసింది. కానీ ఇప్పుడు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం దీనికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమానే సంగీతాన్ని అందిస్తున్నాడు.