Vijay: ‘జననాయకన్’ విడుదలపై సందిగ్ధత.. డిస్ట్రిబ్యూటర్ల డబ్బు వెనక్కి ఇచ్చేందుకు నిర్మాత సిద్ధం?
ABN, Publish Date - Jun 05 , 2026 | 12:47 PM
దళపతి విజయ్ నటిస్తున్న ‘జననాయకన్’ విడుదలపై అనిశ్చితి కొనసాగుతోంది. సెన్సార్ ఆలస్యంతో డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడులు తిరిగి చెల్లించే యోచనలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఉన్నట్లు సమాచారం.
దళపతి విజయ్ (Vijay) కథానాయకుడిగా రూపొందుతున్న భారీ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జననాయకన్’ (Jananayagan) విడుదల విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా భారీ ప్రాజెక్ట్‌ను ఘనంగా ప్రారంభించిన కేవీఎన్ సంస్థ అధినేత వెంకట్ కె. నారాయణన్ ప్రస్తుతం ‘జననాయకన్’కు సంబంధించిన పరిణామాలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియలోనూ జాప్యం ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంతో పంపిణీదారులపై ఆర్థిక భారం పెరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు వారు చెల్లించిన అడ్వాన్స్‌లు లేదా పెట్టుబడులను తిరిగి చెల్లించే అంశాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సినిమాకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిన తర్వాత, ఎలాంటి ముందస్తు వ్యాపార ఒత్తిళ్లు లేకుండా చిత్రాన్ని నిర్మాణ సంస్థ స్వయంగా విడుదల చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక పంపిణీదారుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, సినిమా ఆలస్యం కారణంగా డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు ఎదుర్కోకూడదనే అభిప్రాయాన్ని హీరో విజయ్ వ్యక్తం చేసినట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. దీంతో రిఫండ్ ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న చర్చలకు మరింత ప్రాధాన్యం లభిస్తోంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘జననాయకన్’ విడుదల వ్యూహంపై ప్రస్తుతం అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిత్రం థియేటర్లలోనే విడుదలవుతుందా? లేక ఓటీటీకి వస్తుందా? అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారిక సమాధానం లేదు. అలాగే సెన్సార్ క్లియరెన్స్ ఎప్పుడు లభిస్తుందనే అంశంపైనా నిర్మాణ సంస్థ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
కాగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న మెగా158వ చిత్రం ప్రస్తుతం పొలాచ్చిలో షూటింగ్ జరుపుకుంటుండగా, సంక్రాంతికి థియేటర్లకు రానుంది. భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.