Jana Nayagan: జన నాయగన్.. హైకోర్టు తీర్పు వాయిదా! రీ సెన్సార్‌కు.. 20 రోజులు
ABN, Publish Date - Jan 21 , 2026 | 06:43 AM
తమిళ హీరో విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ జారీ వివాదంపై మద్రాస్ హైకోర్థులో మంగళవారం వాదనలు ముగిశాయి.
తమిళ హీరో విజయ్ (Thalapathy Vijay) నటించిన జన నాయగన్ (Jana Nayagan) చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ జారీ వివాదంపై మద్రాస్ హైకోర్థులో మంగళవారం వాదనలు ముగిశాయి. తమ పిటిషన్‌పై వెంటనే ఆదేశాలు జారీ చేయాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ చేసిన వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు అరుదైనదిగా పరిగణించలేమని పేర్కొంటూ తీర్పును వాయిదా వేసింది.
కేవీఎన్ ప్రొడక్షన్ పతాకంపై హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 9వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో సర్టిఫికేట్ జారీ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. దీంతో సర్టిఫికేట్ జారీ చేయాలని కోరుతూ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ జడ్జి సెన్సార్ సర్టిఫికేట్‌ను జారీ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించారు.
ఈ తీర్పుపై సెన్సార్ బోర్డు తక్షణం అప్పీల్ చేయగా, దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీవాత్సవ, జస్టిస్ అరుల్ మురుగన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పును 20వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలావుంటే, సెన్సార్ సర్టిఫికేట్‌ను త్వరగా జారీ చేసేలా ఆదేశించాలని కోరుతూ నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.
అంతేగాక ఈ నెల 20వ తేదీలోగా తీర్పు వెలువరించాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో మంగళవారం ద్విసభ్య ధర్మాసనం ముందు ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. సెన్సార్ బోర్డు తరపున హాజరైన న్యాయవాది వాదనలు వినిపిస్తూ. 'జన నాయగన్' మూవీని రీ సెన్సార్ చేసేందుకు 20 రోజుల సమయం పడుతుందని తెలిపారు. నిర్మాణ సంస్థ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, 'అనుకున్న ప్రణాళిక మేరకు చిత్రాన్ని విడుదల చేయకపోవడంతో నష్టాలను చవిచూస్తున్నామని వివరించారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ద్విసభ్య ధర్మాసనం.. తీర్పును వాయిదా వేసింది.