నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ ఇకలేరు..
ABN, Publish Date - Jun 27 , 2026 | 10:22 AM
సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) కన్నుమూశారు.
తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు భాషల్లో 75కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు.. సంగీత దర్శకుడిగా సింగర్‌గా కూడా ఆయన అలరించారు. చివరిగా ఆయన '35 చిన్న కథ కాదు', శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ చిత్రంలో సాధు పాత్రలో కనిపించారు.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లాంకోయిల్‌లో ఆయన జన్మించారు. 1981లో నటి ప్రవీణను వివాహం చేసుకున్నారు. కామెర్ల వ్యాధితో ఆమె 1983లో మరణించారు. ఆ తర్వాత 1984లో పూర్ణిమ జయరామ్‌ను పెళ్లాడారు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. కొడుకు శంతను భాగ్యరాజ్ హీరోగా చేస్తున్నారు. కూతురు శరణ్య ‘పారిజాతం’ వంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.
'కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే'గా గుర్తింపు
ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద ‘16 వయదినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) చిత్రానికి సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు భాగ్యరాజ్. ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలోనూ మెరిశారు. 1979లో ‘సువరిల్లాద చిత్రంగళ్’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ‘అన్థా 7 నాట్కళ్’ (రాధా కళ్యాణం), ‘ముంధానై ముడిచ్చు’ (మూడు ముళ్లు), ‘దూరల్ నిన్ను పోచ్చు’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. తమిళంలో ఆయన రూపొందించిన ఎన్నో కథలు తెలుగు, హిందీ భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే భాగ్యరాజ్ అందించడం విశేషం. భాగ్యరాజ్ కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. ఆయన ‘భాగ్యవారపత్రిక’కు సంపాదకుడిగా వ్యవహరించడమే కాకుండా పలు నవలలు కూడా రచించారు. కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. భాగ్యరాజ్ను ఇండియన్ సినిమాలో 'కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే' అని పిలుస్తుంటారు.
భాగ్యరాజ్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.