'టాక్సిక్' హాట్ సీన్స్‌పై సెన్సార్ కత్తి

ABN , Publish Date - Jul 02 , 2026 | 07:04 PM

వెంకట్ కె. నారాయణ మొన్నటి వరకూ ఓ ప్రొడ్యూసర్... ప్రస్తుతం ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధి... ఇప్పుడు ఈ నిర్మాత సినిమాలపై భలేగా చర్చ సాగుతోంది.

Toxic

కేవీయన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ బెంగళూరు నుండి కన్నడ చిత్రాలు నిర్మించారు. తరువాత విజయ్ హీరోగా 'జననాయగన్' తెరకెక్కించారు. ఆల్ ఇండియాలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన ఈ సినిమా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది. సావదానంగా వెళ్ళి ఉంటే ఏమయ్యేదో తెలియదు కానీ, సెన్సార్ బోర్డ్ పైనే పోరాటం సాగించారు నిర్మాత. దాంతో 'జననాయగన్' జనం ముందుకు రావడానికి చాలా జాప్యం జరిగింది. సెన్సార్ పూర్తి చేసుకున్న 'జననాయగన్' త్వరలోనే రిలీజ్ కానుందని టాక్. అయితే ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించక పోవడం గమనార్హం. అప్పటికే తమిళనాడులో 'జననాయగన్' కథానాయకుడు విజయ్ నిజంగానే టైటిల్ జస్టిఫికేషన్ చేస్తూ జననాయకుడుగా గెలిచారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో తన 'జననాయగన్' నిర్మాతను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు.


'జననాయగన్' నిర్మాత వెంకట్ కె. నారాయణ, కన్నడ స్టార్ హీరో యశ్ తో కలసి 'టాక్సిక్' చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ లోనే రావలసిన ఈ సినిమా కూడా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ టీజర్స్, ట్రైలర్స్ చూశాక ఇందులో 'హాట్ హాట్' సీన్స్ ఉన్నట్టు తెలిసిపోతోంది. ఆగిన 'జననాయగన్'ను ఓ వైపు రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు వెంకట్ కె. నారాయణ. మరోవైపు 'టాక్సిక్'ను అనుకున్న తీరున ప్రేక్షకుల ముందు నిలిపే ప్రయత్నంలోనూ ఉన్నారు.'టాక్సిక్' చిత్రాన్ని ఆగస్టు 26న విడుదల చేస్తున్నట్టు ప్రకటించేశారు. 'జననాయగన్' లాంటి సినిమాలోనే కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని అడ్డు చెప్పిన సెన్సార్ బోర్డ్, ఈ 'టాక్సిక్'లో కనిపించిన దృశ్యాలను తెరపై చూపించడానికి అనుమతిస్తుందా అన్నదే ప్రస్తుతం సినీ ఫ్యాన్స్ లో చోటు చేసుకున్న ప్రశ్న.

'జననాయగన్' విషయంలో సెన్సార్ తో పోరాడిన వెంకట్ కె. నారాయణ 'టాక్సిక్'తోనూ వార్తల్లో నిలిచారు. ఈయనే మలయాళంలో 'బాలన్' సినిమాను తీశారు. అలానే చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో ఓ తెలుగు మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇలా తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు సినిమా రంగాల్లో వెంకట్ కె. నారాయణ పేరు విశేషంగా వినిపిస్తోంది. 'జననాయగన్' విషయంలో సెన్సార్ తో కోర్టుదాకా వెళ్ళారు వెంకట్. దీనికి రివైజింగ్‌ కమిటీ 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే అదే తీరున 'టాక్సిక్' కు సెన్సార్ ఇబ్బందులు ఎదురయితే ఎదుర్కోగలరా?. ఈ సారి అలా కాకుండా సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేసుకొనేందుకే వెంకట్ జై కొడతారని వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మరి! 'జననాయగన్' సెన్సార్ చిక్కుల్లో పడి అనుకున్న సమయానికి రాలేదు. ఇప్పటికే వాయిదాలు పడుతూ వస్తోన్న 'టాక్సిక్' అయినా ప్రకటించిన తేదీకి వస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం ప్రారంభం.. హీరో ఎవరంటే

దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో చిరు, వెంకీ, పవన్ సందడి

వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు

Updated Date - Jul 02 , 2026 | 07:28 PM