సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జననాయగన్‌.. ఇక అడ్డంకులుండవు!

ABN, Publish Date - May 06 , 2026 | 06:40 AM

తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ ప్రభంజనం సృష్టించిన దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు.

Jananayagan

తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల్లో రాజకీయ ప్రభంజనం సృష్టించిన దళపతి విజయ్ (Vijay) ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘జననాయగన్‌’ (Jananayagan) విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండకపోచ్చు. సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది. అనేక ఆటంకాలతో వాయిదా పడింది. సెన్సార్‌ సమస్యలు చుట్టుముట్టాయి. బోర్డు సూచనలతో కొన్ని సన్నివేశాలు తొలగించినప్పటికీ సర్టిఫికెట్‌ జారీలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో మేకర్స్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

మరోవైపు ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఓటీటీ బిజినెస్‌ చేజారిపోయింది. ఒకవైపు ఈ ఆటంకాలను అధిగమించే ప్రయత్నంలో చిత్రబృందం ఉంటే.. మరోవైపు ఎన్నికలు సమీపించాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సినిమా రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. దాంతో విజయ్‌ బృందం మొత్తం ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి.పరిస్థితులు కూడా అనుకూలంగా మారిపోయాయి. సినిమా విడుదలకు మార్గం సులువైంది.

ఏది జరిగినా మన మంచికే అన్నట్లు.. తమిళనాడులో ఏమోగానీ.. తెలుగు రాష్ట్రాల్లో గనుక సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ అయి ఉంటే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. ఆ సమయంలో ‘ది రాజాసాబ్‌’, ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ వంటి భారీ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలతో ‘జననాయగన్‌’ పోటీ పడాల్సి వచ్చేది. ఒకవేళ పోటీకి సిద్ధపడ్డా.. సరిపడా థియేటర్లు దొరికేవి కావు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.

ఈ వేసవికి భారీ చిత్రాలేవీ రావడం లేదు. కావలసినన్ని థియేటర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు గనుక విడుదలయితే అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కిక్కిరిసిపోవడం ఖాయమని, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ తప్పదని విజయ్‌ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో భారీ నష్టాలు తప్పవేమోనని భావించిన నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది.

టైటిల్‌ కార్డును మార్చాలంటున్న అభిమానులు

‘జననాయగన్‌’కు మార్గం సుగమం కావడంతో దర్శకనిర్మాతలు విజయ్‌కు అభినందనలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. సినిమా టైటిల్‌ కార్డును మార్చాలంటూ చిత్రబృందానికి విజయ్‌ అభిమానులు రిక్వెస్టు చేశారు. సినిమా ప్రారంభంలో దళపతి విజయ్‌ అని కాకుండా ‘సీఎం దళపతి విజయ్‌’ అని వేయాలని వారు కోరారు.

Updated Date - May 06 , 2026 | 06:51 AM