త్రిష... ఇక నటనకు గుడ్ బై!
ABN, Publish Date - Apr 07 , 2026 | 12:34 PM
రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్‌గా రాణిస్తున్న త్రిష నటనకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్త ప్రస్తుతం తమిళనాడులో విశేషం వినిపిస్తోంది. అతి త్వరలోనే ఆమె విజయ్ కు బాసటగా నిలుస్తూ పొలిటికల్ అరంగేట్రమ్ చేస్తారని సన్నిహితులు చెబుతున్నారు.
త్రిష కృష్ణన్ కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు సినిమాల్లో చిన్న పాత్రలు చేసినా... హీరోయిన్ కాగానే అందరి హృదయాలలో చెరగని ముద్రను వేసింది. కేవలం తమిళంలోనే కాకుండా హిందీతో సహా పలు భాషా చిత్రాల్లో నటించింది. రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్‌గా కెరీర్‌ను సాగించిన త్రిషను చూసి అనేకమంది కథానాయికలు అసూయ పడేవారంటే అతిశయోక్తి కాదు. కెరీర్ పీక్‌లో ఉండగా ఆమె వీడియో ఒకటి లీక్ కావడంతో ఇక త్రిష ముఖం చెల్లక నటనకు గుడ్ బై చెప్పేసి... తెర చాటుకు వెళ్ళిపోతుందని కొందరు భావించారు. కానీ ఆమె అసలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా... దానితో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తించడమే కాదు... ఆ సిట్యుయేషన్‌ను ధైర్యంగా ఎదుర్కొంది. చిత్రసీమలో తన స్థానాన్ని మరింతగా బలంగా నిలబెట్టుకుంది. కెరీర్ పరంగా పలు మార్లు సవాళ్ళను ఎదుర్కొన్న త్రిష... వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంది.
అయితే ఆమె సహ నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి, సొంతంగా పార్టీ పెట్టినప్పటి నుండి వీరిద్దరి అనుబంధానికి సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిష - విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలైతే దావానలంలా వ్యాపించాయి. దాంతో ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కానీ ఆ వెంటనే విజయ్ భార్య విడాకులకు అప్లయ్ చేయడంతో ఆ వ్యాఖ్యలలో కొంత నిజం లేకపోలేదనే భావన చాలా మందికి కలిగింది. ఇదిలా ఉంటే... త్రిష ఇక నటనకు స్వస్తి పలుకుతుందనే వార్త కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే... త్రిష కెరీర్‌ను పడిలేచిన కడలి తరంగంతో చాలామంది పోల్చుతుంటారు. సరైన విజయాలు లేక అవకాశాలు సన్నగిల్లి... 'ఇక త్రిష పని అయిపోయింది' అని అనుకున్న ప్రతిసారి ఆమె బౌన్స్ బ్యాక్ అవుతూ తానేమిటో నిరూపించుకుంది. అలా చూసినప్పుడు కొంతకాలంగా త్రిష టైమ్ నడుస్తోందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. చెప్పుకోదగ్గ విజయాలను గత యేడాది త్రిష అందుకోలేకపోయింది. అజిత్ చిత్రాలు 'విడముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ', కమల్ హాసన్ 'థగ్ లైఫ్' చిత్రాలలో త్రిష నటించింది. తెలుగులో 'విశ్వంభర' విడుదల కావాల్సి ఉంది. అయితే... త్రిషకు ఉన్న ప్రతిభ కారణంగా పలు అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళ్లినా త్రిష... సున్నితంగా వాటిని తిరస్కరిస్తోందట. ఆమె ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడం, తమిళనాట ఎన్నికల వేడి హీటెక్కడం చూస్తుంటే... త్రిష నటనకు స్వస్తి చెప్పినట్టేనని అంటున్నారు. ఈ మాటలను తమిళ సీనియర్ నటుడు, జర్నలిస్ట్ చిత్ర లక్ష్మణన్ బలపరుస్తున్నారు. అంతేకాదు ఆమె విజయ్ పార్టీలో చేరబోతోందనీ అంటున్నారు. చిత్ర లక్ష్మణన్ నోటి నుండి ఈ మాట వచ్చిందంటే... అందులో వాస్తవం ఉంటుందని, ఆయన అంత తేలికగా ఏ మాట చెప్పరని సినీ జనం అంటున్నారు.
ఇదే సమయంలో ఇంకోవాదన కూడా ప్రచారంలో ఉంది. ఒకవేళ విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లను సంపాదించి రాజకీయాలలో కొనసాగితే... అతనికి బాసటగా త్రిష నిలుస్తుందని, ఒకవేళ విజయ్ పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించకపోతే... ఆమె మళ్ళీ సినిమాల్లో నటిగా కొనసాగుతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే... త్రిష ఈ రూమర్స్ ను కొట్టిపారేసింది. తనపై వస్తున్న విమర్శలను ఏకరువు పెడుతూ... ఇవాళ్టి కోట ఇదని వ్యంగ్యంగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది.