సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Yash: నాలాంటి సామాన్యుడు కూడా కలలు కనొచ్చనే ధైర్యాన్ని ఇచ్చారు

ABN, Publish Date - Aug 23 , 2026 | 10:48 AM

మన దేశంలో చాలా భాషలున్నాయి. ప్రతి ఒక్కరికీ వాళ్ల భాషపై ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు మనమంతా ఒక్కటవ్వాలి. ఎవరైనా మనల్ని విడదీయాలని చూసినా, రాజకీయాలు చేయాలని చూసినా మనం వాటిని పట్టించుకోకూడదు.

'మన దేశంలో చాలా భాషలున్నాయి. ప్రతి ఒక్కరికీ వాళ్ల భాషపై ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు మనమంతా ఒక్కటవ్వాలి. ఎవరైనా మనల్ని విడదీయాలని చూసినా, రాజకీయాలు చేయాలని చూసినా మనం వాటిని పట్టించుకోకూడదు. నార్త్‌, సౌత్‌ అంటూ విడిపోవాల్సిన అవసరం లేదు. మనం కష్టపడితే దేశంలో ఎక్కడికి వెళ్లినా అదే ప్రేమ మనకు దొరుకుతుంది' అని యశ్ అన్నారు. ‘కేజీఎఫ్‌’ సినిమాలతో పాన్‌ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు ‘టాక్సిక్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తుండగా.. నయనతార, రుక్మిణీ వసంత్‌, హ్యూమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ  నేపథ్యంలో హైదరాబాద్‌లో ఘనంగా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. 

ఈ సందర్భంగా యశ్‌ మాట్లాడుతూ  “కేజీఎఫ్‌’పై తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ నాకు మాత్రమే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఎవరైనా నిజాయతీగా, ప్యాషన్‌తో కష్టపడి పనిచేస్తే ప్రేక్షకులు ఎప్పుడూ అండగా నిలుస్తారనే భరోసా కలిగింది. నాలాంటి ఒక సామాన్య వ్యక్తి కూడా పెద్ద కలలు కనొచ్చనే ధైర్యాన్ని మీరు ఇచ్చారు. మన మధ్య ఎలాంటి సరిహద్దులు, భాషా భేదాలు లేవని నేను నమ్ముతాను. వాటన్నింటికీ మించి మానవత్వం, ప్రేమ, నిజాయతీ ఉంటాయి. ఇప్పుడు మనదంతా ఒక్కటే సినిమా.. ఇండియన్‌ సినిమా. త్వరలో మనమంతా కలిసి భారతీయ సినిమాను ప్రపంచ పటంపై సగర్వంగా నిలబెడతామని నేను నమ్ముతున్నాను. యువతకు నేను చెప్పేది ఒక్కటే. సినిమాను ఎక్కువ సీరియస్‌గా తీసుకోకండి. మీరు ఒక కలను ఏర్పరచుకుని, దాని కోసం నిజాయతీగా కష్టపడితే ఏ రంగంలోనైనా గౌరవం దక్కుతుంది. విజయం కూడా తప్పకుండా వస్తుంది' అని అన్నారు. 

‘టాక్సిక్‌’ విషయానికి వస్తే.. ఇది ఒక కొత్త ఒరవడిని సృష్టించే సినిమా. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. మేమంతా చాలా పెద్ద విజన్‌తో ఈ సినిమాను చేశాం. ఇది మీకు ఒక మంచి సినిమాటిక్‌ అనుభూతిని అందిస్తుంది. మీరు థియేటర్‌లో చూసినప్పుడు ఆ అనుభూతిని పొందుతారని నేను నమ్ముతున్నాను' అని యశ్ చెప్పారు. 

ఇది సినిమా కాదు.. ఒక గొప్ప అనుభవం: కెవిఎన్

“‘టాక్సిక్‌’ను మేము జెన్‌జీ లాంగ్వేజ్‌లో తెరకెక్కించాం. చాలా పెద్ద విజన్‌తో, ఒక బోల్డ్‌ డ్రీమ్‌తో ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి, ఎంతో నమ్మకంతో పనిచేశాం. మేము పెట్టిన శ్రద్ధ, కష్టం సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ‘టాక్సిక్‌’ కేవలం ఒక సినిమా కాదు.. ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభవం. యశ్‌ ఈ సినిమాను భారతీయ సినిమాను గ్లోబల్‌ వేదికపై నిలబెట్టాలన్న తపనతో చేశారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ విజన్  యశ్‌ కమిట్మెంట్ తో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించింది. ప్రేక్షకులు ఇప్పటివరకు చూసిన సినిమాలకు భిన్నంగా ఒక కొత్త అనుభూతిని ‘టాక్సిక్‌’ ద్వారా పొందుతారని మేము నమ్ముతున్నాం' అన్నారు. 

Updated Date - Aug 23 , 2026 | 11:19 AM