సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘జన నాయగన్‌’ దారిలోనే ‘టిఎన్ 2026’.. సినిమా ఆపాలంటూ హైకోర్టులో పిటీషన్‌!

ABN, Publish Date - Apr 07 , 2026 | 07:29 PM

దళపతి విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’ సినిమాకు కష్టాలు తీరిపోయి, థియేటర్లలో సందడి చేస్తుందనుకున్నంతలోనే ఎలక్షన్‌ కోడ్‌ వచ్చేసింది. ఏప్రిల్ 23న తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘జన నాయగన్‌’ రిలీజ్‌కు బ్రేక్‌ పడింది.

TN 2026 Movie Poster


దళపతి విజయ్‌ (Vijay) నటించిన ‘జన నాయగన్‌’ (Jana Nayagan) సినిమాకు కష్టాలు తీరిపోయి, థియేటర్లలో సందడి చేస్తుందనుకున్నంతలోనే ఎలక్షన్‌ కోడ్‌ వచ్చేసింది. ఏప్రిల్ 23న తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘జన నాయగన్‌’ రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. అయితే ‘జన నాయగన్‌’ తరహాలోనే రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మరో చిత్రం ‘టి.ఎన్‌. 2026’ (TN 2026) సినిమాను ఆపాలంటూ మద్రాస్‌ హైకోర్ట్‌లో పిటీషన్‌ దాఖలైంది. ఏప్రిల్ 10న ఈ మూవీ రిలీజ్‌ కావాల్సి ఉండగా, దీన్ని ఆపమంటూ దేశీయ మక్కల్‌ శక్తి కడ్చి అధ్యక్షుడు ఎం.ఎల్‌. రవి కోర్టు తలుపు తట్టాడు.


తమిళనాడులోని తాజా రాజకీయ అంశాలను ఆధారం చేసుకుని ‘టి.ఎన్. 2026’ మూవీని తీశారని, ఓ రకంగా ఇది విజయ్‌కు సంబంధించిన కథేనని పిటీషనర్‌ రవి వాదిస్తున్నాడు. తమిళనాడులో ఓ స్టార్‌ హీరో రాజకీయాల్లోకి వచ్చి ఎలా సీ.ఎం. అయ్యాడనే అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. హీరోగా నంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉన్న నటుడు, తన అభిమాన సంఘాల సహాయంతో రాజకీయ పార్టీని స్థాపించి, సీఎం కావాలనే కాంక్షతో ఎన్నికల బరిలో దిగుతాడు. అప్పటికే రాజకీయాల్లో ఉన్న పార్టీల అధినేతలు, రాజకీయ నాయకుల కుతంత్రాలను అతను ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ సినిమాలోని ప్రధానాంశం. ఇందులో హీరో కమ్‌ పొలిటీషియన్‌ విజయ్‌ను పోలిన పాత్రను సినిమాటోగ్రాఫర్‌, నటుడు నటరాజన్‌ సుబ్రమణ్యన్‌ పోషించాడు. ఈ సినిమాకు కథను సీనియర్‌ నటుడు తంబి రామయ్య అందించారు. ఈ సినిమా విడుదలైతే కొద్ది వారాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని పిటీషనర్‌ ఎం.ఎల్‌. రవి వాదిస్తున్నారు. సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినంత మాత్రాన ఎన్నికల ముందు ఈ పొలిటికల్‌ డ్రామాను రిలీజ్‌ చేయడం కరెక్ట్‌ కాదంటున్నారు. ఈ విషయంలో తమిళనాడు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ కూడా జోక్యం చేసుకోవాలని ఎం.ఎల్‌. రవి కోరుతున్నాడు.


ఏప్రిల్‌ 2న ‘టి.ఎన్‌. 2026’ టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి పాజిటివ్‌ గానో, నెగెటివ్‌ గానో కోలీవుడ్‌లో చర్చ జరుగుతూనే ఉంది. నటుడు, కథా రచయిత తంబి రామయ్య (Thambi Ramaiah) మాత్రం ఈ సినిమా కథకు, విజయ్‌కు అసలు సంబంధం లేదని, ఇది ఏ ఒక్కరి గురించిన సినిమా కాదని వివరణ ఇచ్చారు. తమిళనాడు రాజకీయాలను దగ్గరగా గమనించిన తాను ఈ కథను యేడాది క్రితం రాశానని, అప్పుడే షూటింగ్‌ ప్రారంభించి, రెండు నెలల క్రితం పూర్తి చేశామని, ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేస్తుందనడంలో వాస్తవం లేదని చెబుతున్నారు. విశేషం ఏమంటే... ఈ సినిమాను డైరెక్ట్ చేసింది తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య. ఇతను మరెవరో కాదు.. యాక్షన్ కింగ్‌ అర్జున్‌ అల్లుడు. ఇటీవల ‘సీతాపయనం’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు వారి ముందుకు వచ్చిన అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య, ప్రేమించి పెళ్ళి చేసుకుంది ఉమాపతినే! అయితే ఇప్పుడు అతను తీసిన సినిమా విడుదల అవుతుందా? లేదా? అనే చర్చ తమిళనాట హాట్ టాపిక్ అవుతోంది. మద్రాస్‌ హైకోర్టు తీసుకునే నిర్ణయంపై ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Updated Date - Apr 07 , 2026 | 07:29 PM