నాయ‌క‌త్వం అంటే ఇది కాదు.. విజయ్‌ సేతుప‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ABN , Publish Date - Sep 15 , 2026 | 01:03 PM

బిగ్‌బాస్ తమిళ్10 తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.

vijay

బిగ్‌బాస్ తమిళ్ 10 ( Bigg Boss Tamil 10) తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక కంటెస్టెంట్ నాయకత్వ శైలిపై స్పందించిన ఆయన, నాయకత్వం అంటే కేవలం హామీలు ఇవ్వడం కాదని, బాధ్యతలు స్వీకరించి సమస్యలు ఎదురైనప్పుడు ముందుండి పరిష్కరించే ధైర్యం ఉండాలని వ్యాఖ్యానించారు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు తప్పించుకోవడం నాయకత్వ లక్షణం కాదని, ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి పని కాదని సేతుపతి అని అన్నారు. ఇప్పుడు ఈ మాటలను ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌స్తుత త‌మిళ‌నాడు రాజకీయాలతో లింక్ పెడుతూ వ్య‌వ‌హారాన్ని మ‌రో స్థాయికి తీసుకెళుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ముఖ్యంగా ఇటీవల సీఎం విజయ్ రాజకీయ రంగప్రవేశం, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విజయ్ (Vijay) సేతుపతి వ్యాఖ్యలకు అనేక మంది ప్రత్యేక అర్థాలు వెతుకుతున్నారు. అయితే ఆయన ఎక్కడా ఏ రాజకీయ నాయకుడి పేరు గానీ, ఏ పార్టీ పేరు గానీ ప్రస్తావించలేదు. అయినప్పటికీ, సేతుపతి ఉద్దేశపూర్వకంగా రాజకీయ వ్యాఖ్యలు చేశారా? లేక నిజంగా బిగ్‌బాస్ హౌస్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య‌లు చేశారా? అనే అంశంపై సోషల్ మీడియాలో వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు విజయ్ సేతుపతి గతంలో నటుడు విజయ్‌పై అభిమానాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

'మాస్టర్' సినిమా విడుదల సమయంలో కూడా విజయ్‌ను 'అన్నా' అంటూ సంబోధిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు ఆ సినిమాలో అత‌నే ప్ర‌ధాన ప్ర‌తి నాయ‌కుడిగా అద‌ర‌గొట్టాడు కూడా. ఈ తాజా ఘ‌ట‌న‌ నేపథ్యంలో ఇద్దరు నటుల అభిమానులు అనవసర ఊహాగానాలు, వివాదాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. పూర్తి సందర్భం తెలియకుండా వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడటం కంటే, బిగ్‌బాస్ షో పరిధిలోనే వాటిని అర్థం చేసుకోవాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Updated Date - Sep 15 , 2026 | 02:18 PM