Ritika Singh: నా పేరుతో.. నాకు తెలియకుండానే సబ్ స్క్రిప్షన్ రూ.400 వసూలు చేస్తున్నారు
ABN, Publish Date - Nov 03 , 2026 | 06:45 AM
నటి రితికా సింగ్ పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ పేజీ సృష్టించి, ఏఐతో రూపొందించిన అసభ్యకర ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత అభివృద్ధి నమ్మశక్యంగా లేదని, అదేసమయంలో అది అత్యంత ప్రమాదకరంగా మారిందని యువ నటి రితికా సింగ్ (Ritika Singh) అభిప్రాయ పడ్డారు. ఆమె పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఖాతాలు ఓపెన్ చేసి, ఏఐ సాంకేతికతో ఆసభ్యకర ఫొటోలు క్రియేట్ చేసి వాటిని పోస్ట్ చేస్తున్నారు.
దీనిపై ఆమె స్పందిస్తూ, ఫేస్ బుక్‌లో నా పేరుమీద ఒక పేజీ ఓపెన్ చేసి, సబ్స్క్రిప్షన్ కింద నెలకు రూ.400 వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ విషయంలో నా అభిమానులు జాగ్రత్తగా ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే నాకు ఖాతా ఉంది. అందులోనే నాకు సంబంధించిన సమాచారం పోస్ట్ చేస్తున్నాను.
కానీ, ఫేస్ బుక్‌లో నా పేరుమీద పేజీ ప్రారంభించి, నెలకు రూ.400 మంత్లీ సబ్ స్క్రిప్షన్ వసూలు చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. పైగా ఈపేజీలో ఏఐతో సృష్టించిన అసభ్యకర ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇది నన్ను అవమానించే స్థాయికి చేరింది. ఏఐ సాంకేతికత అభివృద్ధి నమ్మశక్యం కానిది. ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసేలా వీడియోలు సృష్టిస్తున్నారు.
నా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు చూసినా కూడా అది నేను కాదని గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. ఈ నిజాన్ని అందరికీ తెలియజెప్పాలనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో నా పేరు మీద ఏదైనా ఖాతాలున్నా, అసభ్యకర ఫొటోలు, వీడియోలు కనిపించినా వాటిని నమ్మొద్దు. దయచేసి ఆ పేజీని రిపోర్ట్ చేసి వాటిని తొలగించడంలో మాకు సహకరించండి' అని విజ్ఞప్తి చేశారు.