మరోమారు వార్తల్లో విజయ్! దుబాయ్ నుంచిప్రైవేట్ సెక్యూరిటీ ! కోట్ల వ్యయం
ABN, Publish Date - Apr 20 , 2026 | 02:57 PM
తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ (Vijay) మరోమారు వార్తల్లో నిలిచారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ టీమే!
తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ (Vijay) మరోమారు వార్తల్లో నిలిచారు. ఇప్పటివరకు వ్యక్తిగత సమస్యలు, రాజకీయాలు, సినిమాలు, ఇటీవల రోడ్ షోలో జరిగిన ప్రమాదం వంటి సంఘటనలతో దేశవ్యాప్తంగా వార్తల్లో ఉంటూ వస్తున్న విజయ్ పేరు ఈ మారు మరో ఆసక్తికరమైన అంశంతో దేశ వ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ టీమే. ఆ మధ్య జరిగిన కరూర్ విషాద ఘటన అనంతరం జాగ్రత్తలు తీసుకున్న విజయ్ భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో తన రాబోయే ఎన్నికల ప్రచారం, రోడ్ షోస్ నేపథ్యంలో తనకు రక్షణగా, ప్రచారం జరిగే ప్రాంతాలలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా అనుక్షణం పరిసరాలను కంట్రోల్ చేయగల జెంటూర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ (Gentur Security Services) సంస్థ ప్రత్యేక డీల్ కుదుర్చుకున్నాడు. కేరళకు చెందిన నయీమ్ మూసా (Nayeem Moosa) దుబాయ్ కేంద్రంగా ఈ సంస్థను నడుపుతుండగా ఇప్పటికే దుబాయ్, ఖతార్, కువైట్, ఇండియా, ఒమన్, మలేసియా, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్ దేశాల్లో ఈ సంస్థ 200 రకాల సేవలందిస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వీవీఐపీలకు ఈ సంస్థ బందోబస్తు కల్పిస్తోంది. భారతదేశంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కేరళలోని త్రిశూర్‌లో ఉంది.
ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నయీమ్ మూసా ప్రస్తుతం టీవీకే నేత విజయ్ భద్రతను స్వయంగా హజరవుతూ రోజూ పర్యవేక్షిస్తున్నారు. విజయ్ పర్యటించనున్న ప్రాంతాలను బట్టి భద్రతా ఏర్పాట్లలో అప్పటికప్పుడు మార్పులు కూడా చేస్తుంటారు. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆడవ్ అర్జున, మాజీ మంత్రి సెంగోట్టయ్యన్ సహా పార్టీ ప్రముఖులంతా నయీమ్ మూసా అనుమతి తీసుకున్న తరువాతే విజయ్‌ని కలవడానికి వీలవుతుంది. కేరళ శాసనసభ ఎన్నికల్లో నయీమ్ మూసా ఓటు వేయడానికి వీలుగా తన ఒక రోజు పర్యటన విజయ్ రద్దు చేసుకోవడాన్ని బట్టి ఆయనకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అవగతమవుతుంది.
జనం మధ్య.. మఫ్టీలో వంద మంది కమెండోలు
విజయ్ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుండి జెంటూర్ సెక్యూరిటీ సంస్థకు చెందిన బాడీ గార్డులు లేదా బౌన్సర్లు ఐదుగురు మాత్రమే ఉండే వారు. కేంద్రప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించినప్పటికీ తన రోడ్లకు వేల సంఖ్యలో గుమికూడే జనసమూహాన్ని నియంత్రించడానికి ఈ ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకున్నారు విజయ్. కరూర్ దుర్ఘటన తర్వాత విజయ్ ప్రచార పర్యటనకు సంబంధించి నిఘా కోసం ఆ సంస్థకు చెందిన వందమంది కమెండోలను రప్పించారు. ఆ కమెండోలు ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారో విజయ్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు. అంతటి గోప్యత పాటిస్తున్నారు. విజయ్ వాహనంతో పాటు ముగ్గురు బౌన్సర్లు మాత్రమే ప్రచారంలో అందరికీ కనిపి స్తారు. ఆ ముగ్గురిలో విజయ్ కి అత్యంత చేరువలో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని నయీమ్ మూసా ఉంటారు.
ఇక ఈ వందమంది కమెండోలు మాత్రం ఆయా ప్రాంతాల్లో సాధారణ దుస్తులు ధరించి సామాన్య ప్రజలతో పాటు నిలిచి, నలు దిక్కులా నిఘా వేస్తుంటారు. ఈ వందమంది విజయ్ ప్రచారం చేయనున్న ప్రాంతానికి గంట ముందే చేరుకుని జనంతో కలసిపోతారు. వీరి వద్ద అత్యంత శక్తివంతమైన వాకీటాకీలు, సెల్ ఫోన్లుంటాయి. ఈ వంద మంది అప్పటికప్పుడు విజయ్ ప్రచారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయమై అక్కడి పరిస్థితులను అంచనా వేసుకున్న తర్వాత ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత ఆ వందమందికి నాయకత్వం వహించే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నేరుగా విజయ్‌కు ఫోన్ చేసి రోడ్ షో కు అనుమతిస్తారు లేదా పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకోమని హెచ్చరిస్తారు. ప్రచారం చేసే ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉందా లేదా అని ముందుగానే ఈ వందమంది పరిశీలిస్తారు. జనం విపరీతంగా కట్టుదిట్టం చేయనంతగా ఉంటే ఈ బృందం వెంటనే పర్యటన రద్దు చేస్తుంది.
ఈ విషయం విజయ్ చెవిన పడగానే ఆయన ప్రచార వాహనాన్ని యూటర్న్ చేసుకుని వెళ్లిపోతారు. ఈ భద్రతా బృందం ఆదేశాల మేరకే విజయ్ తన పర్యటనలను తరచూ రద్దు చేసుకుంటు న్నారని టీవీకే నాయకులు చెబుతున్నారు. విజయ్ ప్రచారం రద్దయ్యే విషయం బుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున, సెంగోట్టయ్యన్‌కు కూడా ఆలస్యంగానే తెలుస్తుంది. ఆ ప్రకారం ఈ దుబాయ్ సెక్యూరిటీ సంస్థ భద్రతా విధుల్లో అత్యంత గోప్యత పాటిస్తుందని వివరించారు. కరూర్ సంఘటన తర్వాత ఏర్పాటు చేసుకున్న ఈ భద్రతా సేవలకు గాను దుబాయ్ సంస్థకు విజయ్ ప్రతినెలా కోట్లాది రూపాయలను ఖర్చుపెడుతున్నారని ఆ నాయకులు తెలిపారు.