ఇది రాజకీయం.. ఉదయనిధి అరెస్ట్ పై విశాల్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 07 , 2026 | 08:01 PM
తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ వర్సెస్ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మధ్య చెలరేగిన మాటల యుద్ధం తీవ్ర కలకలం రేపింది.
తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ (Vijay) వర్సెస్ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మధ్య చెలరేగిన మాటల యుద్ధం తీవ్ర కలకలం రేపింది. తంజావూరు పర్యటనలో నటి త్రిష, సీఎం విజయ్‌లను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడం, దానిపై కేసు నమోదు కావడంతో ఉదయనిధి అరెస్ట్ కావడం, ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల కావడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా లేదా మహిళలను కించపరిచేలా మాట్లాడలేదని ఉదయనిధి వివరణ ఇచ్చాడు.తాజాగా ఈ ఉద్రిక్త పరిణామాలపై నటుడు, దర్శకుడు విశాల్ తన తాజా చిత్రం మగుడం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
విశాల్ కి విజయ్ సీనియర్ .. ఉదయనిధి స్టాలిన్ బ్యాచ్ మేట్ అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఈ ఇంటర్వ్యూలో తన కాలేజీ రోజులను కూడా గుర్తుచేసుకున్నాడు. 'మేమంతా చెన్నైలోని లయోలా కాలేజీలో చదువుకున్నాం. ప్రస్తుత సీఎం విజయ్ సర్ మాకు కాలేజీ సీనియర్ కాగా, ఉదయనిధి స్టాలిన్ నా బ్యాచ్‌మేట్. ఎప్పటికైనా మా సీనియర్ మా బ్యాచ్‌మేట్‌ను జైలుకు పంపుతాడని మేము కాలేజీ రోజుల్లో కలలైనా ఊహించలేదు. కానీ ఇప్పుడు కాలం మారింది, విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు, ఉదయనిధి ప్రతిపక్షంలో ఉన్నారు. రాజకీయం అంటేనే ఇదే.. ఇందులో ఏమైనా జరగొచ్చు.
నేను రికార్డింగ్ స్టూడియోలో ఉన్న సమయంలోనే ఉదయనిధి మీటింగ్ చూశాను. అనేక మీడియా సంస్థలు ఉదయనిధి మాట్లాడిన పూర్తి వ్యాఖ్యలను ప్రసారం చేయకుండా కేవలం కొన్ని భాగాలనే చూపించాయి. ఒక జాతీయ ఛానెల్ మాత్రమే ఉదయనిధి వ్యాఖ్యలను పూర్తి నిడివిలో ప్రసారం చేసింది. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రిని విమర్శించినప్పుడు ఇలాంటి తీవ్ర పరిణామాలు, చట్టపరమైన చర్యలు ఎదురవ్వడం సహజమే. ఇరువైపులా ఇది వర్తిస్తుంది. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలను తప్పించి ఉంటే ఈ వివాదం రాకుండా ఉండేది. అలాంటి సమయాలలో మాటలు హద్దు దాటకూడదు. దీంతో తప్పు జరిగిందని పోలీసులు భావించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు' అని విశాల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.