Baththa: అసలు ఎలా తీశార్రా ఈ సినిమా.. మైండ్ లోనుంచి పోవడం లేదు
ABN , Publish Date - Oct 31 , 2026 | 04:43 PM
కొన్ని సినిమాలు చూసేటప్పుడు చివరకు ఏమవుతుందో అనే టెన్షన్ ఒకటి ఉంటుంది. మనం అనుకున్నది జరుగుతుందా.. ? లేదా ట్విస్ట్ ఉంటుందా.. ? అని ఎంతగానో ఎదురుచూస్తాం.
కొన్ని సినిమాలు చూసేటప్పుడు చివరకు ఏమవుతుందో అనే టెన్షన్ ఒకటి ఉంటుంది. మనం అనుకున్నది జరుగుతుందా.. ? లేదా ట్విస్ట్ ఉంటుందా.. ? అని ఎంతగానో ఎదురుచూస్తాం. చివర్లో మనసును మెలిపెట్టే క్లైమాక్స్ చూసినప్పుడు కనపడకుండానే కళ్ళు తడి అవుతూ ఉంటాయి. మనసంతా తేలిక పడుతుంది. ఒక మంచి సినిమా చూశాం అనే తృప్తి ఉంటుంది. ఈమధ్యకాలంలో అందరికీ అలాంటి తృప్తిని ఇచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది 'బత్తా' (Baththa) అని చెప్పొచ్చు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కథానాయకుడిగా, 'నడువుల కొంజమ్ పక్కత కానోమ్', 'సీతకత్తి' ఫేమ్ బాలాజీ తరణీధరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అట్లీ భార్య ప్రియ అట్లీ నిర్మించడం విశేషం. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బత్తా భారీ విజయాన్ని అందుకొని ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎలా అలరించిందో చూద్దాం.
ఈ సినిమా కథ 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో సాగుతుంది. బత్తా (విజయ్ సేతుపతి) ఒక భయంకరమైన, కోపిష్టి గ్యాంగ్‌స్టర్. జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబంతో నివసిస్తూ ఉంటాడు. శబరి (మాస్టర్ సాయి పృథ్వీరాజ్) అనే ఎనిమిదేళ్ల పిల్లాడికి భయమెక్కువ. బత్తా గురించి, అతడి రౌడీయిజం గురించి ఫ్రెండ్స్ చెప్పినప్పుడు విని.. బత్తా అన్న పేరు విన్నా భయపడుతూ ఉంటాడు. శబరి పరీక్ష రాసేటప్పుడు బొమ్మతో ఆడుకోవడంతో టీచర్ అతని బొమ్మని దాచేస్తుంది. ఆ తరువాత సెలవులు ఇవ్వడంతో శబరి ఆ బొమ్మని తీసుకోవడానికి స్కూల్‌కు వెళతాడు. అనుకోకుండా బాత్ రూమ్ కి వెళ్లిన ఆ కుర్రాడు.. లోపల ఎవరు లేరు అనుకోని తలుపు బయట గొళ్ళెం పెడతాడు. వేరే కారణం వలన స్కూల్ కి వెళ్లిన బత్తా ఆ బాత్రూమ్లో ఉండిపోతాడు. అలా దాదాపు ఎనిమిది రోజుల పాటు ఆకలి, ఒంటరితనంతో ఆ బాత్రూమ్లోనే బందీ అయిన భయంకరమైన రౌడీకి, ఆ పిల్లాడికి మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? అది వారి జీవితాలను ఎలా మార్చింది? అనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశం.
ఒక రౌడీకి, ఒక చిన్న పిల్లాడికి మధ్య జరిగే సున్నితమైన, భావోద్వేగ భరితమైన కథాంశంతో రూపొందింది. కమర్షియల్ హంగులకు దూరంగా, కేవలం పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీ, నటన ఆధారంగా సాగే ఒక స్వచ్ఛమైన సినిమా ఇది. టాక్సిక్ మాస్క్యులినటీ అనే పాయింట్‌ను లెక్చర్లు దంచకుండా ఎంత ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారనేది ఈ సినిమా హైలైట్. మొదటి భాగం మొత్తం ప్యూరిటీ, కామెడీ అండ్ సస్పెన్స్ ఉంటుంది. శబరి అమాయకత్వం, భయం కామెడీని పండించినా.. అంతా చిన్న వయస్సులో అతడి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. పైకి రౌడీ అని చెప్పుకున్నా కూడా బత్తా లోపల దాగున్న మంచి మనిషి ఎలా బయటకు వచ్చాడు అని చూపించే విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ క్లిఫ్ హ్యాంగర్ బ్లాక్ ప్రేక్షకులను థియేటర్ సీట్ల అంచున కూర్చోబెడుతుంది. సెకండ్ హాఫ్ అంతా చాలా హార్ట్ వార్మింగ్‌గా, ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్ లో బత్తా- శబరి హాగ్ సీన్ కళ్ళనీళ్లు తెప్పిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే, విజయ్ సేతుపతి తన స్టార్ ఇమేజ్ను పక్కన పెట్టి బత్తా పాత్రలో అద్భుతంగా నటించాడు. ఒక డాన్‌గా ఉంటూనే, బాత్రూమ్లో బందీ అయినప్పుడు అనుభవించే ఆకలి, నిస్సహాయత, అసహాయతలను తన మార్క్ నటనతో పండించాడు. ఇక చిన్న పిల్లాడిగా నటించిన మాస్టర్ సాయి పృథ్వీరాజ్ నటన సినిమాకు ప్రాణం పోసింది. వీరిద్దరి మధ్య వచ్చే సంభాషణలు, సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తూనే, గుండెలను పిండేసేలా భావోద్వేగానికి గురిచేస్తాయి. లిజోమోల్ జోస్, శాంతి బాలచంద్రన్ వంటి నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
దర్శకుడు బాలకృష్ణ తరణీధరన్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. 1980ల నాటి వాతావరణాన్ని, సాయి అభ్యంకర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చక్కగా ఎలివేట్ చేశాయి. సినిమా లెంత్ కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ, క్లైమాక్స్ ఇచ్చే ఫీల్ గుడ్ ఎమోషన్ ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుంది. ఇక చిన్న చిన్న లాజిక్స్ ని డైరెక్టర్ మర్చిపోయినా.. కథ ఫ్లోని బట్టి అవేమీ ప్రేక్షకుడికి పెద్ద లోపాలుగా అనిపించవు. మొత్తంగా బత్తా అనేది ఎలాంటి భారీ యాక్షన్ సీన్లు లేకుండా, కేవలం మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే అద్భుతమైన సినిమా. ప్రతి ఒక్కరూ తప్పక చూడదగ్గ క్లాసిక్ సినిమా. బత్తా చూశాక కొద్దిసేపటి వరకు ఆ మూడ్ లో నుంచి బయటకు రాలేము అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వారం కుటుంబంతో కలిసి బత్తాని చూసేయండి.