విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం.. వాటికి గుడ్ బై
ABN , Publish Date - Aug 03 , 2026 | 06:11 PM
కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా ఎదిగాడు.
కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). విలక్షణమైన కథలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా ఎదిగాడు. పిజ్జా, విక్రమ్ వేద, 96, మాస్టర్, ఉప్పెన, విక్రమ్, జవాన్, మహారాజ వంటి విభిన్నమైన సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కాకుండా కొన్ని సినిమాల్లో క్యామియో పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. అయితే, తాజాగా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఇకపై ఏ సినిమాలోనూ అతిథి లేదా క్యామియో పాత్రలు చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ సేతుపతి వెల్లడించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఉన్న అపారమైన గౌరవంతో జైలర్ 2 చిత్రానికి మాత్రమే దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు. 'జైలర్ 2 లో నా పోస్టర్ రిలీజ్ అయినా జనాలు రజనీ సార్‌నే చూస్తారు. కానీ ఇతర సినిమాలలో నా క్యామియో పాత్రలను ప్రమోషన్లు, మార్కెటింగ్ కోసం వాడుకుంటున్నారు. ఇది నేను ప్రధాన పాత్రలో నటించే సినిమాలపై తీవ్ర నెగెటివ్ ప్రభావం చూపుతోంది' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
తన స్టార్‌డమ్‌ను కేవలం ప్రచారానికి వాడుకోవడం వల్ల సోలో హీరోగా తాను చేసే చిత్రాల బిజినెస్ దెబ్బతింటోందని విజయ్ సేతుపతి చాలా లేట్ గా గ్రహించినట్లు తెలుస్తోంది. సాధారణంగా కథ నచ్చితే విజయ్ ఎలాంటి పాత్రకు చేయడానికి అయినా వెనుకాడడు. కానీ, కొన్ని సినిమాల్లో ఆయన పాత్ర కేవలం మార్కెట్ ని పెంచుకోవడానికి మాత్రమే వాడుకున్నట్లు కనిపిస్తాయి. అందుకే ఇకపై ఎలాంటి చిన్న పాత్రలు, గౌరవ పాత్రలను ఒప్పుకోకూడదని, కేవలం తన సోలో సినిమాలు, ప్రాధాన్యత ఉన్న ప్రధాన పాత్రలపైనే దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యినట్లు తెలుస్తోంది. వర్సటైల్ యాక్టర్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంపై అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్.. మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మరి ఈ సినిమాలతో విజయ్ సేతుపతి ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.