తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక బరిలో లారెన్స్!

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:50 PM

గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజక వర్గాల నుంచి గెలిచిన విజయ్‌ తిరుచ్చి ఈస్ట్ కు రాజీనామా చేస్తారని అంటున్నారు. అక్కడ నుంచి టీవీకే పార్టీ లారెన్స్‌ను బరిలోకి దించబోతోందనే ప్రచారం జరుగుతోంది.

Vijay - Lawrence

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ (Vijay) గత ఎన్నికల్లో రెండు స్థానాల నుండి పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. అయితే... ఆయన పెరంబూర్‌లో కొనసాగుతూ, తిరుచ్చి ఈస్ట్ నియోజక వర్గానికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక కీలకంగా మారనుంది. మొదట ఈ స్థానం నుండి విజయ్‌ స్నేహితులు, స్టార్ హీరోయిన్‌ త్రిష (Trisha) పోటీ చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లే నని టీవీకే నేతలు చెబుతున్నారు. విజయ్‌కు సహాయకురాలిగా త్రిష ఉంటారు తప్పితే, ఆమె ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనరని అంటున్నారు.

ఈ నేపథ్యంలో టీవీకే ఈ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దించుతుందనే విషయంలో అందరి చూపు డాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ లారెన్స్ వైపు మళ్ళుతోంది. ఎందుకంటే విజయ్‌ పార్టీ పెట్టిన దగ్గర నుండి లారెన్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా విజయ్‌కు దన్నుగా నిలిచాడు. విజయ్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పుడు కూడా ఆయన్ని అభినందించాడు.


టీవీకే పార్టీ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖను రాజ్ మోహన్‌కు అప్పగించడాన్ని విశాల్‌ (Vishal) వంటి కొందరు నటులు విమర్శించారు. ఏ అనుభవం లేని అతనికి ఆ శాఖ ఇవ్వడం సరికాదన్నారు. కానీ లారెన్స్ ఆ సమయంలో విజయ్‌ తీసుకున్న నిర్ణయాన్ని బలపరిచాడు. సినిమా పరిశ్రమ తీరు తెన్నుల గురించి రాజ్‌ మోహన్‌ అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని, అలా కాకుండా నియమించిన వెంటనే ఇలా విమర్శించడం సరికాదని లారెన్స్ (Lawrence) అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా... లారెన్స్ కొన్నేళ్ళుగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. మరీ ముఖ్యంగా దివ్యాంగుల సేవలో ముందుంటున్నాడు. దాంతో అతనికి సినిమా రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఆ ఇమేజ్‌ ఇప్పుడు టీవీకే తరఫున ఎన్నికల బరిలో దిగితే మరింత ఉపయోగపడుతుందని విజయ్‌ భావిస్తున్నాడట. నిజానికి అధికారపార్టీ అయిన టీవీకే ఈ ఉప ఎన్నికల్లో గెలవడం అనేది సులువే. కానీ ఒకవేళ డీఎంకే, అన్నా డీఏంకీ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుని రాజకీయం చేస్తే... వారిని ఎదుర్కొనడానికి బలమైన అభ్యర్థి ఉండాలని, అది లారెన్స్ అయితే బాగుంటుందని టీవీకే వర్గాలు భావిస్తున్నాయట.

మరి త్రిష పేరులానే.... ఇప్పుడు లారెన్స్ పేరు కూడా ప్రచారంలోకి రావడమన్నది కేవలం పుకారా? లేక నిజమా? అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది!

ఇవి కూడా చదవండి

వారణాసి.. ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందా?

Vijay: ‘జననాయకన్’ విడుదలపై సందిగ్ధత.. డిస్ట్రిబ్యూటర్ల డబ్బు వెనక్కి ఇచ్చేందుకు నిర్మాత సిద్ధం?

Rashmika Mandanna: ఆ పాత్రలో నటించేందుకు.. ముందు భయపడ్డా...

Updated Date - Jun 05 , 2026 | 12:51 PM