Scene: ఈ యేడాది ముచ్చటగా సూర్య మూడో సినిమా!
ABN, Publish Date - Sep 09 , 2026 | 06:40 PM
సూర్య తాజా చిత్రానికి 'సీన్' అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమాను నవంబర్ 6న దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇది ఈ యేడాది సూర్య నుంచి వస్తున్న మూడో సినిమా కావడం విశేషం.
ఎవరైనా అతి చేస్తే 'వాడికి అంత సీన్ లేదు' అని చెబుతుంటారు. కానీ కొందరికి మాత్రం అంత సీన్ ఉంటుంది. అదే సూర్య! గత కొన్నేళ్ళుగా వరుస పరాజయాలతో సాగుతున్నా తమిళ స్టార్ హీరో సూర్య క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. భిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలూ చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ యేడాది అతనిదే! మే 15న విడుదలైన సూర్య సినిమా 'కరుప్పు' ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీతో సూర్య మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ అయ్యి... ఇక్కడా విజయకేతనం ఎగరేసింది. సినిమా చూసిన వాళ్ళు పెదవి విరిచినా... సాధారణ జనాలకు 'వీరభద్రుడు' తెగ నచ్చేసింది.
'కరుప్పు' విడుదలైన మూడు నెలలకే... ఈ సంవత్సరం సూర్య రెండో సినిమాగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్ట్ 14న విడుదలైంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా తమిళులను పెద్దంతగా ఆకట్టుకోలేదు కానీ తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ రకంగా సూర్యకు ఇదీ హిట్ చిత్రం కిందే లెక్క. ఇక తాజాగా ఇప్పుడు మూడో సినిమా రాబోతోంది. 'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 'ఆవేశం, రోమాంచమ్' దర్శకుడు జీతూ మాధవన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య సరసన నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఈ సినిమాకు 'సీన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోనూ విడుదల చేశారు. మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ దీనికి స్వరాలు సమకూర్చుతున్నాడు.
నవంబర్ 6న పాన్ ఇండియా స్థాయిలో రణబీర్ కపూర్, యశ్, సాయిపల్లవి నటిస్తున్న 'రామాయణ' రాబోతోంది. మరి ఆ సినిమా నుంచి ఎదురయ్యే పోటీని 'సీన్' ఏ మేరకు తట్టుకుంటుందో చూడాలి. ఒకవేళ ఇదీ మంచి విజయాన్ని అందుకుంటే సూర్య ఈ యేడాది హ్యాట్రిక్ సాధించినట్టే అవుతుంది.