సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suriya: కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి

ABN, Publish Date - Aug 04 , 2026 | 09:06 AM

ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమ యం గడపాలని తన అభిమానులకు హీరో సూర్య పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమ యం గడపాలని తన అభిమానులకు హీరో సూర్య పిలుపునిచ్చారు. ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ ఆదివారం రాత్రి కోవై వేదికగా అభిమానుల సమక్షంలో నిర్వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించగా, జాతీయఅవార్డు గ్రహీత జీవీ ప్రకాష్‌ కుమార్‌  స్వరాలు సమకూర్చారు. సూర్య, మమిత బైజు జంటగా నటించిన ఈ చిత్రంలో రాధిక, రవీనా టాండన్‌, యోగిబాబు, నాజర్‌, కాళి వెంకట్‌, జార్జ్‌మరియన్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు నటించారు. 

ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ ‘ఆడియో రిలీజ్‌ వేడుక  పండుగ వాతావరణంలో జరగడం ఎంతో సంతోషంగా ఉంది. నాపై అమితమైన ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. కొన్ని కారణాల వల్ల పుట్టిన రోజు వేడుకలు జరుపుకోలేదు. అయినప్పటికీ మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీరు చేసే ప్రతి పనిని నిశితంగా గమనిస్తున్నాను. కోయంబత్తూరు నా జన్మస్థలం. ఈ గడ్డపై అడుగుపెడితే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. గత యేడాది నా ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి వారితో నా చిన్ననాటి ఙ్ఞాపకాలను పంచుకున్నాను. కులదైవం ఆలయానికి వెళ్ళి పూజలు చేశాం. ఇపుడు డిజిటల్‌ ఎర సాగుతోంది. దీంతో మొబైల్‌ ఫోన్లలో గడిపే సమయం పెరిగిపోయింది. ఈ సమయంలో మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. స్క్రీన్  సమయాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. మీ జ్ఞాపకాలను చిరకాలం భద్రపరుచుకోండి. ఫోన్‌ చూడటం వల్ల కలిగే జ్ఞాపకాల కంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి, ఊరి గురించి, మీ సంబంధ బాంధవ్యాల గురించి చర్చించుకోండి. ‘కరుప్పు’ సినిమా శతదినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నాగవంశీకి డబ్బు పెట్టుబడిగా పెట్టడమే కాదు... ప్రేక్షకులకు ఎలాంటి సినిమా అందించాలో బాగా తెలుసు. మంచి కథాంశంతో కూడిన సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు' అన్నారు.  

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, ‘2డీ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మాత రాజశేఖర్‌కు ఈ కథ వినిపించినపుడు ఆయన విని కొన్ని చోట్ల భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే సూర్యకు కథ చెప్పడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత కథ వినగానే సూర్య కూడా మరోమాట చెప్పకుండా మనం ఈ సినిమాలో కలిసి పనిచేస్తున్నాం అని చెప్పారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌తో మూడో సారి కలిసి పనిచేస్తున్నాను. ప్రతిసారీ, ప్రతి విషయంలోనూ ఆయన నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. నా అంచనాలకు మించి సంగీతం అందించారు. ఇది హీరో సూర్యకు ఒక కొత్త తరం చిత్రం. ఈ సినిమా జెన్‌ జీ అభిమానులకు కూడా బాగా నచ్చుతుంది’ అని పేర్కొన్నారు. 

Updated Date - Aug 04 , 2026 | 09:40 AM