Sreleela: ధనుష్‌లో ఆ ప్రత్యేకత గమనించా.. శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు!
ABN, Publish Date - Nov 17 , 2026 | 07:42 PM
తమిళ స్టార్ ధనుష్ గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఓ ఆసక్తికర విషయాన్ని కథానాయిక శ్రీలీల బయట పెట్టింది
తమిళ స్టార్ ధనుష్ గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఓ ఆసక్తికర విషయాన్ని కథానాయిక శ్రీలీల బయట పెట్టింది. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటపెట్టని ధనుష్‌లోని ఓ ప్రత్యేకత తనను ఆశ్చర్యపరిచిందని ఆమె చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ‘ఓ.ఎం. (ఆపరేషన్ మోల్)’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ కార్యక్రమంలో ధనుష్ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం చెప్పాలని శ్రీలీలను యాంకర్ అడగ్గా.. ఆయన పక్క నుంచి వెళ్లిన ప్రతిసారీ విభూతి పరిమళం వస్తుందని వెల్లడించారు. ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడే ఆ సువాసనను గుర్తించగలమని చెప్పారు. చెన్నైలో జరిగిన ప్రచార కార్యక్రమంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించానని, తెలుగు ప్రేక్షకులకు కూడా ధనుష్‌లోని ఈ ప్రత్యేకత తెలియాలనే మరోసారి చెప్పానని వివరించారు. దీంతో ధనుష్‌లోని ఆధ్యాత్మిక భావన గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే వేదికపై తనకు తెరపై భర్తగా నటిస్తున్న ధనుష్‌కు ఎలాంటి సలహా ఇస్తారని అడగ్గా శ్రీలీల సరదాగా స్పందించారు. సినిమాలో ఆయన భార్య రోజా కోరుకునేది ఒక్కటేనని.. భర్త ఇంట్లో తనతో ఎక్కువ సమయం గడపాలని ఆశిస్తుందని చెప్పారు. ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని నవ్వులు పూయించారు.మరోవైపు సాయిపల్లవి కూడా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఎదురైన సరదా అనుభవాలను పంచుకున్నారు. 'చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మమ్ముట్టి నన్ను ‘సాయిపల్లవి మేడమ్’ అని పిలిచారు. ఆయన అలా సంబోధించడం వెనుక ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. షూటింగ్ సమయంలో మమ్ముట్టి చాలా సరదాగా ఉంటారు. అందరితో చిన్నపిల్లాడిలా కలిసిపోతూ జోకులు వేస్తూ నవ్విస్తుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభూతి' అని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.ధనుష్, సాయిపల్లవి జంటగా గతంలో ‘రౌడీ బేబీ’ పాటతో చేసిన సందడి ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంది. ఈ సినిమాలోనూ అలాంటి డ్యాన్స్ ఉంటుందా? అని అడగ్గా.. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి కథ చెప్పే సమయంలోనే ధనుష్‌తో కలిసి నృత్య సన్నివేశాలు ఉండవని స్పష్టం చేశారని సాయిపల్లవి వెల్లడించారు.