చిత్ర పరిశ్రమ నాకు నేర్పింది ఇదే: శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 29 , 2026 | 10:32 AM
విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసి.. తనదైన వైవిధ్యమైన నటన, గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్. తాజాగా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసి.. తనదైన వైవిధ్యమైన నటన, గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్ (Shruti Haasan). కథానాయికగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా సినీ పరిశ్రమలో విజయవంతంగా 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తన సుదీర్ఘ సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రయాణం తనకు, తన వృత్తికి, సమాజానికి సంబంధించి ఎన్నో కొత్త విషయాలను నేర్పించిందని, ముఖ్యంగా ఒక వ్యక్తిగా తనను ఎంతో పరిణతి చెందేలా చేసిందని శ్రుతి హాసన్ వెల్లడించారు.
తాజాగా తన సోలో మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన శ్రుతి హాసన్.. చిత్ర పరిశ్రమ తనకిచ్చిన గొప్ప పాఠాల గురించి వివరించారు. ‘‘ఒక కొత్త ఆవిష్కరణను సృష్టించాలన్నా, లేదా మన పరిధులను దాటి సరికొత్తగా ఆలోచించాలన్నా అడ్డంకులను అధిగమించడం ఎంతో ముఖ్యం. దానికి ఒక పెద్ద బృందం యొక్క కృషి అవసరమని ఈ ప్రయాణంలో తెలుసుకున్నాను. ఈ 17 ఏళ్ల సినీ జీవితంలో ఇండస్ట్రీ నాకు నేర్పిన అతిపెద్ద పాఠం ఏమిటంటే.. నన్ను మానసికంగా, శారీరకంగా మరింత దృఢంగా మార్చడమే’’ అని పేర్కొన్నారు.
సినిమా రంగంలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదని, ఇక్కడ ఎలాంటి విమర్శలనైనా, సవాళ్లనైనా తట్టుకుని పట్టుదలతో నిలబడడం పరిశ్రమే తనకు నేర్పించిందని ఆమె స్పష్టం చేశారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అధిగమించే ఆత్మవిశ్వాసాన్ని, దృఢత్వాన్ని ఈ రంగం తనకు ప్రసాదించిందని చెప్పారు. ఒకవైపు నటిగా క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తూనే, మరోవైపు సంగీతంపై ఉన్న మక్కువతో ప్రైవేట్ ఆల్బమ్స్‌తో అలరిస్తున్న శ్రుతి హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
ఇవి కూడా చదవండి:
నేడు నటి పావలా శ్యామల అంత్యక్రియలు
Naga Chaitanya: ప్రేమకథలు తగ్గిపోయాయని బాధపడ్డా..
నచ్చిన అమ్మాయిలకు బీట్ వేయండి.. ఫ్యాన్స్ కి బన్నీ సలహా