చిరు, యశ్‌లతో భారీ ప్రాజెక్టులు మిస్.. అసలు నిజం బయటపెట్టిన దర్శకుడు
ABN , Publish Date - Aug 21 , 2026 | 08:29 AM
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు టాప్ స్టార్స్.. మెగాస్టార్ చిరంజీవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌లతో చేయాల్సిన ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయో.. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెల్లడించారు.
‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు), ‘హీరో’, ‘సర్దార్’, ‘సర్దార్ 2’ వంటి వైవిధ్యమైన థ్రిల్లర్ చిత్రాలతో సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ (PS Mithran). తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు టాప్ స్టార్స్.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash)లతో చేయాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ హీరోలతో తాను చేయాల్సిన భారీ చిత్రాలు ఎందుకు కార్యరూపం దాల్చలేదో వివరిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ముందుగా ‘కెజియఫ్’ ఫేమ్ యశ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను యశ్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశాను, కథ విన్న తర్వాత ఆయనకు కూడా కథ విపరీతంగా నచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ప్లానింగ్ ప్రకారం యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా పూర్తయిన వెంటనే మా ప్రాజెక్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇద్దరి డేట్స్, టైమ్‌లైన్ మ్యాచ్ కాకపోవడంతో ఈ సినిమా ప్రస్తుతానికి పట్టాలెక్కలేకపోయింది’’ అని మిత్రన్ తెలిపారు.
ఇక మెగాస్టార్ చిరంజీవితో చర్చల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసే పూర్తి వైవిధ్యమైన కథను సిద్ధం చేసి వినిపించాను. కథ విన్న మెగాస్టార్ కూడా కథపై ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ‘విశ్వంభర’ సినిమా తర్వాత ఆయనతో ఈ ప్రాజెక్ట్ చేయాలని భావించాం. కానీ దురదృష్టవశాత్తూ డేట్స్, షెడ్యూల్స్ టైమ్‌లైన్ కొలాప్స్ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వెంటనే ముందుకు తీసుకెళ్లలేకపోయాం. అయితే ఆ కథలు ఇంకా నా వద్దే ఉన్నాయి’’ అని స్పష్టం చేశారు. సరైన సమయం కుదిరితే భవిష్యత్తులో ఈ కాంబోస్ సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే ఆశను సినీ అభిమానుల్లో ఈ వ్యాఖ్యలు రేకెత్తిస్తున్నాయి. ఇక కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో యశ్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం ఈ నెల 26న విడుదలయ్యేందుకు సిద్ధమవగా, అదే ప్రొడక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న ‘మెగా158’ చిత్ర టైటిల్‌ని చిరు బర్త్‌డే స్పెషల్‌గా ఆగస్ట్ 22న రివీల్ చేయబోతున్నారు.
ఇవి కూడా చదవండి:
‘ఇట్లు అర్జున’.. థియేటర్లలోకి వచ్చే డేట్ ఫిక్స్!
పీవీఆర్ సినిమాస్ చేతికి ‘ధర్మస్థల నియోజకవర్గం’.. రిలీజ్ డేట్ ఫిక్స్
వెంకీమామ ఫ్యాన్స్‌కు చిరంజీవి అభినందనలు.. విషయం ఏంటంటే