వెంకీమామ ఫ్యాన్స్‌కు చిరంజీవి అభినందనలు.. విషయం ఏంటంటే
ABN , Publish Date - Aug 20 , 2026 | 08:26 PM
విక్టరీ వెంకటేష్ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న అరుదైన సందర్భంగా ఆయన అభిమానులు చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు.
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న అరుదైన సందర్భంగా ఆయన అభిమానులు చేసిన గొప్ప సేవా కార్యక్రమంపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రశంసల జల్లు కురిపించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 43 మంది వెంకటేష్ అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అభిమానాన్ని సేవగా మలిచి ప్రాణదాతలుగా నిలిచిన అభిమానులను అభినందిస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఓ అభినందన లేఖను విడుదల చేశారు.
ఆల్ ఇండియా వెంకటేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రామకృష్ణకు రాసిన లేఖలో చిరంజీవి తన ఆప్తమిత్రుడు వెంకటేష్‌పై ఉన్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు. ‘‘నాలుగు దశాబ్దాలుగా తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ, కుటుంబ కథా చిత్రాల నుంచి విభిన్నమైన పాత్రల వరకు తనదైన ప్రత్యేకతను చాటుకున్న నా స్నేహితుడు విక్టరీ వెంకటేష్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రేక్షకులను అలరిస్తూ, మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

అలాగే రక్తదానం చేసిన అభిమానులను కొనియాడుతూ.. ‘‘తమ అభిమాన కథానాయకుడి సినీ ప్రయాణంలో ఒక మైలురాయిని సమాజానికి ఉపయోగపడే రక్తదానం వంటి గొప్ప సేవా కార్యక్రమంతో జరుపుకోవడం నిజంగా అభినందనీయం. అభిమానం సేవా రూపం దాల్చినప్పుడు అది సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ శిబిరాన్ని నిర్వహించిన టీమ్‌తో పాటు.. రక్తదానం చేసిన 43 మంది ‘బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు అందించిన రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది’’ అని చిరంజీవి శ్లాఘించారు. భవిష్యత్తులోనూ వెంకీ ఫ్యాన్స్ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. టాలీవుడ్ అగ్ర హీరోల మధ్య ఉన్న ఈ ఆత్మీయ బంధం, అభిమానుల సేవాతత్పరతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘ఇరుముడి’లో ఎలా అవకాశం వచ్చిందంటే.. : బేబీ నక్షత్ర
‘అమీర్ లోగ్’తో హైదరాబాద్ ఎరా స్టార్ట్.. ఇక అన్ని వుడ్‌లకు సౌండే!
అనుపమ - ధ్రువ్ కాంట్రవర్సీపై శంకర్ కుమార్తె షాకింగ్ కామెంట్స్!