Nayanthara: రెండు రోజుల గ్యాప్ తో నయన్ రెండు సినిమాలు!
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:04 PM
లేడీ సూపర్ స్టార్ నయనతార చిత్రాలు రెండు రోజుల వ్యవథిలో రెండు రాబోతున్నాయి. ఈ నెల 26న 'టాక్సిక్' విడుదల కాబోతుండగా, నయన్ హీరోయిన్ గా నటించి, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న 'హాయ్' 28న జనం ముందుకు రానుంది.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న విడుదల కాబోతోంది. అదే రోజున లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం 'హాయ్' కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడీ సినిమా బరి నుంచి తప్పుకుంది. నయనతార సరసన కవిన్ తొలిసారి హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను లోకేష్ కనగరాజ్ శిష్యుడు విష్ణు తెరకెక్కించారు. ఆయనకు ఇది దర్శకుడిగా తొలి చిత్రం. లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'డీసీ' శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అలానే ఆ తర్వాత వారానికే సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్ట్ 14న రాబోతోంది. దీని తర్వాత వారంలో మలయాళ చిత్రాలు 'ఐ యామ్ గేమ్', 'ఖలీఫా' విడుదల కాబోతున్నాయి. దాంతో నయనతార 'హాయ్'ను ఈ నెల 28కి పోస్ట్ పోన్ చేశారు.
'టాక్సిక్' వెనుకే 'హాయ్'!
నయనతార నటించిన 'హాయ్'ను 28కి పోస్ట్ చేయడం పెద్ద విశేషం ఏమీ కాదు. కాకపోతే... సరిగ్గా దానికి రెండు రోజుల ముందు నయనతార కీలక పాత్ర పోషించిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' రిలీజ్ అవుతోంది. యశ్ హీరోగా నటించిన 'టాక్సిక్'ను గీతూమోహన్ దాస్ తెరకెక్కించారు. పలు మార్లు వాయిదా పడిన తర్వాత ఈ సినిమాను ఆగస్ట్ 26న విడుదల చేయడానికి మేకర్స్ సిద్థ పడ్డారు. కానీ ఇప్పుడు నయన్ నటించిన 'హాయ్' చిత్రం 28న వస్తుండటంతో నయన్ అభిమానులకు డబుల్ ట్రీట్ లభించనట్టు అవుతోంది. కాకపోతే తెలుగులో శర్వానంద్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'భోగి' సైతం ఆగస్ట్ 28నే విడుదల కాబోతోంది. ఆ రకంగా నయనతార 'హాయ్'కు ఇటు 'టాక్సిక్' అటు 'భోగి' నుంచి పోటీ ఎదురుకాబోతోంది.
విష్ణు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'హాయ్' చిత్రంలో ఇటీవల కన్నుమూసిన కె. భాగ్యరాజ్ తో పాటు ప్రభు, రాధికా శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కథిర్, ఖురైషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోద్ సి.జే., కె.ఎస్. మయిల్ వాగనన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, వి.కె. కుబీంద్రన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.
ఈ మూవీ గురించి దర్శకుడు విష్ణు మాట్లాడుతూ, ' 'హాయ్' టైటిల్‌లాగే ఇది ఒక సింపుల్, హార్ట్ వార్మింగ్, ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యాల్లో సాగే ఈ సినిమా కుటుంబం మొత్తం కలిసి థియేటర్‌లో చూసి ఆస్వాదించేలా రూపొందించాం. 'డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్', 'సంతోష్ సుబ్రమణ్యం', 'యారాడి నీ మోహిని' వంటి చిత్రాల తరహాలో బంధాలు, భావోద్వేగాలు, హాస్యంతో సాగే కథ ఇది' అని అన్నారు. మరి నయన్ నిర్మాతగానూ వ్యవహరించిన 'హాయ్' బాక్సాఫీస్ బరిలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read:
Chandini Chowdary: కమిట్‌మెంట్ ఇవ్వలేదని ఇండస్ట్రీలో బ్యాడ్ చేశాడు..
రూ. కోటి విరాళం.. రజనీకాంత్ హామీపై లతా రజనీకాంత్ స్పష్టత!
ఇది రాజకీయం.. ఉదయనిధి అరెస్ట్ పై విశాల్ సంచలన వ్యాఖ్యలు