ఈసారి అయినా వింటేజ్ మణిరత్నం కనిపిస్తాడా

ABN , Publish Date - Jul 27 , 2026 | 04:22 PM

స్టార్ డైరెక్టర్ మణిరత్నం(Manirathnam) సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన లవ్ స్టోరీస్ తెరకెక్కించే విధానం అద్భుతం అని చెప్పొచ్చు.

Mani Ratnam

స్టార్ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన లవ్ స్టోరీస్ తెరకెక్కించే విధానం అద్భుతం అని చెప్పొచ్చు. అయితే కొన్నాళ్లుగా మణిరత్నం ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కొత్తతరం ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా మణిరత్నం తన కథలను ఎంచుకోవడం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ పరాజయం తర్వాత మణిరత్నం తనకు బాగా అలవాటైన, అత్యంత పట్టున్న లవ్ స్టోరీ జోనర్‌కే మళ్లీ ఓటేశారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ఆయన తన తదుపరి ప్రేమకథా చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టాలెక్కించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి


తాజాగా ఈ క్లాసిక్ లవ్ స్టోరీ షూటింగ్ కోల్‌కతా లో జరుగుతోంది. ఇటీవల చిత్రబృందం కోల్‌కతా చేరుకుని ఈ సినిమా షూటింగ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. హౌరా బ్రిడ్జ్ సమీపంలో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ సేతుపతి క్లీన్ షేవ్ తో కనిపించగా.. సాయి పల్లవి మోడ్రన్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది. కోల్‌కతా నేపధ్యంలో సాగే సరికొత్త లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మణిరత్నం గతంలో 2009లో వచ్చిన రావణ్ సినిమా కోసం కోల్‌కతాలో షూటింగ్ చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అనేక అద్భుతమైన ప్రేమకథలకు నిలయమైన ఆ చారిత్రాత్మక నగరంలో ఆయన కెమెరా పట్టడం విశేషం.


చెక్క చివంత వానమ్ (నవాబ్) తర్వాత విజయ్ సేతుపతితో మణిరత్నం చేస్తున్న రెండో సినిమా కాగా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవితో పనిచేయడం ఇదే తొలిసారి.ఈ సినిమాపై మణిరత్నం చాలా ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా ఈసారి వింటేజ్ మణిరత్నం కనిపిస్తారని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ లవ్ స్టోరీతో మణిరత్నం సాలిడ్ కంబ్యాక్ ఇస్తారా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Jul 27 , 2026 | 04:24 PM