లోకేష్ డిసి ట్రైలర్.. ఏం తాగి కొట్టావురా బక్కోడా మ్యూజిక్
ABN, Publish Date - Jul 22 , 2026 | 10:14 PM
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డిసి (DC) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే.
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డిసి (DC) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. కళానిధి మారన్ సమర్పణలో ప్రసిద్ధ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో లోకేష్ సరసన వామికా గబ్బి నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమిళ్ లో రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని తెలుగులో రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఊపిరి బిగబట్టే సీన్లతో సాగింది. ఇందులో లోకేష్ కనగరాజ్ దేవదాస్ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించగా, వామికా చంద్ర పాత్రలో కనిపించింది. ట్రైలర్ లో పూర్తి కథను రివీల్ చేయకపోయినా.. జీవితాల్లో ఓడిపోయిన ఒక జంట కథగా అనిపిస్తుంది. దేవదాస్ రౌడీ.. చంద్ర ఒక వేశ్య.. ఇంట్లోవాళ్లే ఆమెను అమ్మేస్తారు. అనుకోకుండా చంద్ర ఒక డాక్టర్ ని హత్య చేసి పోలీసులకు చిక్కుతుంది. వారి నుంచి దేవదాస్.. చంద్రను కాపాడతాడు. ఆ తరువాత ఈ జంట ఎలా పోలీసుల నుంచి తప్పించుకున్నారు. వీరి గతాలు ఏంటి.. ? చివరకు డిసి ఏమయ్యారు.. ? అనేది కథగా తెలుస్తోంది.
ట్రైలర్ గురించి పక్కన పెడితే.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఈ మ్యూజిక్ ఇప్పుడు తెలుగువారికి కూడా సుపరిచితమయ్యింది. అసలు ఆ మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా అవ్వడం ఖాయం. ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మైండ్ లో నుంచి పోవడం కష్టం అని చెప్పొచ్చు. ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విన్నాక ఫ్యాన్స్.. అసలు ఏం తాగి కొట్టావురా బక్కోడా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక లోకేష్ యాక్టింగ్ అదరగొట్టేశాడు. దేవదాస్ గా ఆయన జీవించేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి డైరెక్టర్ గా హిట్ అందుకున్న లోకేష్ హీరోగా ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.