Khushbu: మహిళలను ఇంకెంత కాలం నిందిస్తారు!?

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:25 PM

ప్రముఖ నటి త్రిషపై మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖుష్బూ తీవ్రంగా ఖండించారు. మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే బదులు ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆమె కోరారు.

Khushbu Sunder

ప్రముఖ కథానాయిక త్రిషను ఉద్దేశించి, తమిళనాడు మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ఉదయనిధికి సినిమా రంగంతో ఉన్న అనుబంధం కారణంగా సినీ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ విషయంలో పెద్దగా నోరు మెదపలేదు. అయితే స్టాలిన్ కుటుంబానికి సన్నిహితురాలైన ఖుష్బూ మాత్రం ఈ విషయంలో తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించింది. కరుణానిథి తన రాజకీయ గురువు అని చెప్పడానికి ఇప్పటికీ వెరవని ఖుష్బూ ఆయన మనవడిపై ఫైర్ కావడం చాలా మందిని ఆశ్చర్యానికి లోను చేసింది. నిజానికి ఇవాళ చాలామంది సినీ నటీనటులు నిర్మించే చిత్రాలను ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయింట్‌ పంపిణీ సంస్థ విడుదల చేస్తుంటుంది. కానీ అవి అవే... ఇవి ఇవే అన్నట్టుగా ఖుష్బూ చేసిన విమర్శలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.


ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి ఖుష్బూ ప్రస్తావిస్తూ, 'నిజం చెప్పాలంటే.. ఈ వ్యాఖ్యలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఇలాంటి మహిళా వ్యతిరేకత, లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలను నేను ఇంతకుముందే చూశాను. డీఎంకేలో మహిళలను అవమానించే ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. ఇప్పుడు అదే వారసత్వాన్ని ఉదయనిధి కొనసాగిస్తున్నారని స్పష్టమవుతోంది. నిజానికి ఉదయనిధి లాంటి యువ నాయకుడు చేయాల్సిన పని కాదు ఇది. ఆయన యువ నాయకుడు, హుందాగా ప్రతిపక్షంలో ఉంటారని భావించాను. కానీ ఆయన కూడా ఇలాంటి అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయనలో ఇప్పటికీ పశ్చాత్తాపం లేకపోవడం మరింత విచారకరం' అని అన్నారు.

మహిళలను రాజకీయ క్రీడలో పావుగా వాడటాన్ని ఖుష్బూ తీవ్రంగా నిరసించారు. 'ఒక బహిరంగ వేదికపై మహిళను దూషించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఇది కేవలం ఉదయనిధి స్టాలిన్ విషయంలోనే కాదు, ఇతర రాజకీయ పార్టీలలోనూ జరుగుతోంది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెన్నాళ్లు మహిళలను నిందిస్తారు? మీ స్వార్థ ప్రయోజనాల కోసం మహిళను అడ్డుపెట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ ఆమెను అవమానిస్తున్నారంటే.. మీరు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమవుతోంది. మిమ్మల్ని మీరు బలమైన నాయకుడని చెప్పే అర్హత కోల్పోయారు. మీకు ధైర్యముంటే, నిజమైన నాయకుడిగా కొనసాగాలంటే.. ఏ మహిళనూ దూషించకుండా రాజకీయాల్లో నిలబడి చూపించండి. అది చేయగలరో లేదో చూద్దాం' అని ఖుష్బూ సవాల్ విసిరారు.


ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా చప్పట్లు కొట్టింది ప్రజలు కాదని, పార్టీ కార్యకర్తలేనని ఖుష్బూ అన్నారు. 'గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కార్యకర్తలే తమ పార్టీకి ఓటు వేయలేదు. వారి కుటుంబ సభ్యులు కూడా డీఎంకేకు మద్దతు ఇవ్వలేదు. కాబట్టి అక్కడ చప్పట్లు కొట్టింది ప్రజలు కాదు. ఆయన చుట్టూ తిరిగే భజనపరులు మాత్రమే. ఒక మహిళను అవమానిస్తుంటే ఆనందపడుతూ చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం వారి మహిళా వ్యతిరేకత, వికృత మనస్తత్వాన్ని బయటపెడుతోంది. మహిళలు ఎవరికైనా ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుకునే పావులు కాదు. ఆడుకునే బొమ్మలు అంతకంటే కాదు. సమాజంలో పరస్పర గౌరవం నెలకొనాలంటే బాధ్యత, జవాబుదారీతనం తప్పనిసరి' అని ఆమె అన్నారు. వ్యక్తిగత దూషణలకు బదులుగా ప్రజా సమస్యలపై చర్చించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఖుష్బూ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

గ్లామర్‌ డోస్ పెంచితే ఆఫర్స్‌ వచ్చేస్తాయా రాశీ..

ఓరి మీ దుంప‌ తెగ.. స్పైడ‌ర్ మ్యాన్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా!

‘రాంబాయి’ కూడా ఫీల్డ్‌లోకి దిగిందిగా!

Updated Date - Aug 05 , 2026 | 03:29 PM