Jason Sanjay: హీరోగా కొడుకు.. సీఎం విజయ్ ఏమన్నారంటే
ABN, Publish Date - Jul 17 , 2026 | 10:13 AM
కోలీవుడ్ సూపర్ స్టార్, సీఎం జోసెఫ్ విజయ్ (Joseph Vijay) కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) త్వరలోనే దర్శకుడిగా వెండితెరకు పరిచయమవబోతున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ సూపర్ స్టార్, సీఎం జోసెఫ్ విజయ్ (Joseph Vijay) కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) త్వరలోనే దర్శకుడిగా వెండితెరకు పరిచయమవబోతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన తన మొదటి సినిమా సిగ్మా త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా ఇండస్ట్రీలోకి తన ఎంట్రీ గురించి జేసన్ సంజయ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. స్టార్ హీరో కొడుకు హీరోగానే ఎంట్రీ ఇస్తాడు. కానీ, జేసన్ మాత్రం డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. గత కొన్నిరోజులుగా జేసన్ హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక జేసన్ తన తల్లిదండ్రులు అయిన విజయ్ - సంగీత తన హీరో ఎంట్రీ గురించి ఏమన్నారో చెపుకొచ్చాడు.
తను సినీ రంగంలోకి అడుగుపెట్టే విషయంపై తన తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులతో మాట్లాడానని, తన నిర్ణయానికి వారంతా ఎంతో సానుకూలంగా స్పందించి, తనలో కొండంత శక్తిని నింపారని జేసన్ సంజయ్ తెలిపాడు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని చూశాకే.. వారికి తనపై ఎంతటి గాఢమైన విశ్వాసం ఉందో నిజంగా అర్థమైందని సంజయ్ ఎమోషనల్ అయ్యాడు. తాను ఒక సినీ కుటుంబం నుంచి రావడం వల్ల, చాలా చిన్న వయసులోనే షూటింగ్ స్పాట్‌లకు వెళ్లే అలవాటు ఉండేదని, చిన్నతనం నుంచి ఎన్నో సినిమాల ప్రీమియర్ షోలను వీక్షించానని, సినిమాలు చూడటం అనేది ఎప్పుడూ తన జీవితంలో అతిపెద్ద హాబీగా మారిందని జేసన్ తెలిపాడు.
ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు అన్ని రకాల జోనర్లకు సంబంధించిన సినిమాలు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని జేసన్ సంజయ్ చెప్పుకొచ్చాడు. నటన వైపు వెళ్లకుండా దళపతి విజయ్ వారసుడు డైరెక్షన్‌ను తన కెరీర్‌గా ఎంచుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, సిగ్మా తరువాత జేసన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఎలాగూ విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉంటారు. ఇక ఆయన ఫ్యాన్స్ అందరూ వారసుడు సినిమాల కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. ఇక కొడుకు ఎంట్రీ అంటే విజయ్.. ఎలాంటి డైరెక్టర్ ని దింపుతారో చూడాలి.