GV Prakash Kumar: దుమ్మురేపుతున్న జీవీ ప్రకాశ్‌

ABN , Publish Date - Aug 13 , 2026 | 04:01 PM

మూడు వారాల వ్యవథిలో జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన నాలుగు చిత్రాల విడుదల. ఒకే రోజున వస్తున్న 'విశ్వనాథ్‌ అండ్ సన్స్, మకుటం' సినిమాలు.

GV Prakash Kumar

ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ మేనల్లుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టినా... తొలి చిత్రం 'వేసవి'తోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జీవీ ప్రకాశ్‌ కుమార్. ఆ తర్వాత వరుస చిత్రాలకు సంగీతం అందిస్తూనే హీరోగా మారిపోయాడు. తమిళనాట జీవీ ప్రకాశ్‌ కుమార్‌కు హీరోగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అయినా సంగీతాన్ని మాత్రం పక్కన పెట్టలేదు జీవీ. హీరోగా అడపా దడపా నటిస్తూ, మ్యూజిక్ డైరెక్షన్ కే ప్రాధాన్యం ఇచ్చాడు. అనిరుధ్‌ ప్రభంజనం ఇప్పుడు తమిళనాట సాగుతున్నా, సాయి అభ్యంకర్ వేవ్ కోలీవుడ్ లో సంచలనం రేపుతున్నా... జీవీ ప్రకాశ్‌ మాత్రం తన పని తాను చిత్తశుద్ధితో చేసుకుంటూ వెళుతున్నాడు. నిజానికి గతంలో కంటే ఇప్పుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఎక్కువ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. చాలా వేగంగా వంద సినిమాల మైలురాయిని కూడా ఈ యువ సంగీత దర్శకుడు దాటేశాడు.


విశేషం ఏమంటే గత నెల 30 నుంచి ఈ నెల 21 వరకూ జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం సమకూర్చిన నాలుగు సినిమాలు తెలుగులో వచ్చాయి, వస్తున్నాయి. జూలై 30న జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన 'శ్రీనివాస మంగాపురం'కు జీవీ సంగీతం అందించాడు. సినిమాకు ప్రతికూల ఫలితం వచ్చినా, మూవీ ఓ మేరకు ఆడిందంటే... అది జీవీ ప్రకాశ్‌ సంగీత ప్రభావమే. అలానే శుక్రవారం జనం ముందుకు రాబోతున్న రెండు తమిళ చిత్రాలకు జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించాడు. అందులో ఒకటి సూర్య నటించిన 'విశ్వనాథ్‌ అండ్ సన్స్' కాగా, మరొకటి విశాల్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న 'మకుటం'. ఈ రెండు కూడా తెలుగులో డబ్ అయ్యి విడుదలవుతున్నాయి. ఇదే నెల 21న రాబోతున్న రవితేజ 'ఇరుముడి'కి సంగీతం అందించింది కూడా జీవీ ప్రకాశ్‌ కుమారే. ఇప్పటికే 'ఇరుముడి' పాటలు శ్రోతల ప్రశంసలు అందుకుని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇలా కేవలం మూడు వారాల వ్యవథిలో ఓ సంగీత దర్శకుడి నాలుగు సినిమాలు విడుదల కావడం అరుదైన అంశమే!

ఇవి కూడా చదవండి:

స్పా సెంటర్ లో నటికి  ఏం జరిగిందంటే.. 

సుకుమార్‌ తనయ సుకృతి వేణికి అరుదైన ఘనత

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ప్రభాస్ ఫోటో.. ఇలా ఉన్నాడేంటి

Updated Date - Aug 13 , 2026 | 04:06 PM