Dhanush: నాకు అన్యాయం జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు..
ABN, Publish Date - Jul 26 , 2026 | 08:47 PM
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush) వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈమధ్యనే ధనుష్ రాయన్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే.
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush) వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈమధ్యనే ధనుష్ రాయన్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే. రాయన్ (Raayan) సినిమాకు నేషనల్ అవార్డు రావడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న విషయం కూడా విదితమే. మెయ్యళగన్ (సత్యం సుందరం), మహారాజ వంటి అద్భుతమైన సినిమాలు ఉన్నప్పుడు రాయన్ చిత్రానికి అవార్డు ఇవ్వడం ఏంటని దాదాపు 90 శాతం మంది నెటిజన్లు విమర్శించారు. కేవలం ఈ అవార్డు ధనుష్ ని చూసే ఇచ్చారని, ఇది అన్యాయమని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ వివాదంపై నటుడు ధనుష్ ఘాటుగా స్పందించాడు.
ఇన్ డైరెక్ట్ గా రాయన్ కి అవార్డ్ రావడం తప్పేనని చెప్తూనే తనకు జరిగిన అన్యాయం గురించి ఎవరూ మాట్లాడలేదని ధనుష్ ఇన్ డైరెక్ట్‌గా గట్టి కౌంటర్ ఇచ్చాడు. 'గత ఏడాది విడుదలైన మెయ్యళగన్, మహారాజ చిత్రాలు రాయన్ కంటే చాలా మంచి సినిమాలే, అందులో సందేహం లేదు. కానీ గతంలో నేను నటించిన పుదుపేట్టై, వడ చెన్నై, కర్ణన్, మరియాన్, రాంఝణా వంటి క్లాసిక్ సినిమాలు విడుదలైనప్పుడు వాటికి నేషనల్ అవార్డులు రావాలని ఏ ఒక్కరూ ఇంత గట్టిగా మద్దతు ఇవ్వలేదు ఎందుకు.. నాకు అన్యాయం జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు.
ఈరోజు నా నేషనల్ అవార్డును దాదాపు 90% మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ నా కెరీర్‌లో నిజంగా నేషనల్ అవార్డులకు అర్హత ఉన్న సినిమాలు అవార్డులు అందుకోలేకపోయినప్పుడు కనీసం 10% మంది కూడా నా తరఫున మాట్లాడలేదు. తప్పుబట్టడం కాదు.. నన్ను ప్రోత్సహించండి' అని ధనుష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.