Dhanush 55: ధనుష్ 55 ‘ఓం’.. రిలీజ్ డేట్ ఫిక్స్
ABN, Publish Date - Jul 26 , 2026 | 12:02 PM
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్రలో 'ఓం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్రలో 'ఓం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'అమరన్' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సందర్భంగా వండర్‌బార్ ఫిలిమ్స్' ప్రతినిధి శ్రేయస్ మాట్లాడుతూ 'ధనుష్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఆర్ టేక్ స్టూడియోస్ తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో వారికి ఇదే మొదటి చిత్రం. మా జర్నీ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా టీజర్, ఇతర అప్‌డేట్స్ అందరినీ అలరిస్తాయని ఆశిస్తున్నాను. అక్టోబర్ 16న ఈ మూవీని విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.
రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ 'ఈ చిత్రానికి ‘OM: Chapter 1’ అని పేరు పెట్టాము. ఇది కేవలం ఆధ్యాత్మికమైన శీర్షిక మాత్రమే కాదు, అనేక అర్థాలను ఇమిడ్చుకున్న ఒక ప్రత్యేకమైన టైటిల్ ఇది. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, వివిధ కోణాలు ఉన్నాయి. మొదటి షెడ్యూల్ వరకు అన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. సెట్‌లో టీమ్ కష్టం చూస్తుంటే ఇది ప్రతీ ఒక్కరికీ ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అర్థం అవుతోంది. నిర్మాతల సహకారం మరువలేనిది. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, ఇంద్రన్ అనేకమంది ప్రతిభావంతులైన నటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. అందరి కృషి ఫలితంగా ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ప్రధాన పాత్రల పరిచయ టీజర్లు, ప్రధాన ట్రైలర్ విడుదల కానున్నాయి. అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది' అని అన్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తవగా, తదుపరి నిర్మాణ దశల పనులు వేగంగా సాగుతున్నాయి.