సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

CM Vijay: నా జీవితంలోనే అత్యంత బాధాకరమైన ఘటన అదే..

ABN, Publish Date - Jul 10 , 2026 | 04:41 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత విజయ్ జోసెఫ్ (Vijay Joseph) రాజకీయ కెరీర్ లో మాయని మచ్చగా మిగలిన సంఘటన కరూర్ తొక్కిసలాట అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

CM Vijay

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత విజయ్ జోసెఫ్ (Vijay Joseph) రాజకీయ కెరీర్ లో మాయని మచ్చగా మిగలిన సంఘటన కరూర్ తొక్కిసలాట అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గత ఎన్నికల సమయంలో జరిగిన టీవీకే బహిరంగ సభ తొక్కిసలాటలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన జరిగిన దగ్గరనుంచి సీఎం అయ్యేవరకు కూడా విజయ్ ఆ ఘటన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక సీఎం అయ్యాక మొదటిసారి విజయ్ కరూర్ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. తొక్కిసలాటలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆ ఘోర ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల్లోని 32 మందికి తాను అండగా ఉంటానని హామీ ఇవ్వడమే కాకుండా స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.


ఈ సందర్భంగా కరూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం విజయ్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆనాటి తొక్కిసలాట ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని, తన జీవితంలోనే అది అత్యంత బాధాకరమైన సంఘటన అని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని, ఆరోజు వారు కేవలం డ్రామా ఆడారని విజయ్ మండిపడ్డారు. అయితే అప్పటి అధికార పక్షం నుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉండటం వల్లే వారు అలా ప్రవర్తించాల్సి వచ్చిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.


ఇదే సభలో డీఎంకే పార్టీపై కూడా సీఎం విజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసిందని, ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని, కానీ తమ ప్రభుత్వం బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కల్పించి ఆదుకుందని విజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదిఏమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు విజయ్ పై తమిళనాడు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 04:45 PM