నిస్వార్థ సేవకు ప్రతిరూపం విజయకాంత్: సీఎం విజయ్
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:00 PM
డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత నటుడు ‘కెప్టెన్’ విజయకాంత్ 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘన నివాళులర్పించారు.
డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత నటుడు ‘కెప్టెన్’ విజయకాంత్ (Captain Vijayakanth) 74వ జయంతి వేడుకలు (Birth Anniversary Celebrations) ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ‘‘మానవత్వం, తిరుగులేని ధైర్యం, నిస్వార్థ సేవకు నిలువెత్తు ప్రతిరూపం కెప్టెన్ విజయకాంత్. సినిమా రంగంలో తనదైన శైలితో చెరగని ముద్ర వేయడమే కాకుండా, రాజకీయాల్లో ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన అసలైన ప్రజా నాయకుడు. నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి ప్రేమ, ఆప్యాయతలతో ఎల్లవేళలా అండగా నిలిచిన ఆ విప్లవ కళాకారుడి కీర్తి చిరకాలం నిలచిపోవాలి’’ అంటూ సీఎం విజయ్ (CM Vijay) కొనియాడారు.
డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా తన ప్రియ మిత్రుడు విజయకాంత్‌ను స్మరించుకుంటూ భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. ‘‘పేద ప్రజల పట్ల చూపిన ప్రేమతో కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న నా ప్రియ మిత్రుడు విజయకాంత్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్న డీఎండీకే శ్రేణులకు, వారికి దిశానిర్దేశం చేస్తున్న సోదరి ప్రేమలత విజయకాంత్‌కు నా శుభాకాంక్షలు. కెప్టెన్ కీర్తి ఎప్పటికీ వర్ధిల్లాలి’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
మరోవైపు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) తాత్కాలిక కార్యాలయంలో విజయకాంత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తి, కార్యవర్గ సభ్యులు హేమచంద్రన్, దళపతి దినేష్, శ్రీమాన్ తదితరులు విజయకాంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఇండస్ట్రీని ఏకతాటిపైకి తెచ్చి, కళాకారుల సంక్షేమానికి ఆయన చేసిన విశేష సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అభిమానులు, డీఎండీకే శ్రేణులు పలుచోట్ల అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
నా భర్త నా కోరిక తీర్చేశారు: నటి పూర్ణ భావోద్వేగం
గొప్ప మనసు చాటుకున్న వినోద్ కుమార్.. ఏం చేశారంటే
‘ఇరుముడి’పై రామ్ చరణ్ ట్వీట్.. వాట్టే టైమింగ్