Kollywood: అందరి చూపు శాంతను వైపు!
ABN, Publish Date - Jul 02 , 2026 | 03:43 PM
మరణానంతరం భాగ్యరాజా పేరుతో బయటకు వచ్చిన రెండు లేఖలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని ఆయన కొడుకు శంతను సృష్టించాడని కొందరు అంటున్నారు.
ఇటీవల కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు భాగ్యరాజా చివరి ఉత్తరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గుండెపోటుతో ఇటీవల భాగ్యరాజా హఠాన్మరణం చెందినప్పుడు అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనకు తమిళ సినీ పరిశ్రమ ఘన నివాళులు అర్పించింది. అయితే... ఆయన చనిపోయి పట్టుమని వారం కూడా గడవకముందే... తాజాగా ఈ ఉత్తరాల గొడవ మొదలైంది. ఇందులో భాగ్యరాజా తన కుమారుడు శాంతనకు అండగ ఉండమని కోరినట్టుగా ఇందులో ఉంది. భాగ్యరాజా లెటర్ హెడ్ మీద ప్రింట్ చేసి ఉండటంతో వీటిని ఆయన రాసిన వాటిగానే అభిమానులు భావిస్తున్నారు.
భాగ్యరాజా తనయుడు శాంతను తమిళంలోనే కాదు తెలుగులోనూ 'లవ్ ఇన్ హైదరాబాద్' వంటి సినిమాలో నటించాడు. అయితే తండ్రికి తగ్గ తనయుడిగా మాత్రం పేరు తెచ్చుకోలేకపోయాడు. పలు తమిళ చిత్రాలలో నటించాడు కానీ అవేవీ పెద్దగా విజయం సాధించలేదు. కెరీర్ పరంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న శాంతనుకు అండగా ఉండమని ఓ తండ్రిగా భాగ్యరాజా కోరడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు.
అదే సమయంలో ఆయన కుమార్తె శరణ్య గురించి ఒక్క మాట కూడా ఆ లేఖలో ఉండకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే భాగ్యరాజాకు కుమార్తె శరణ్య అంటే కూడా ఎంతో ప్రేమ. ఆమెతో ఆయన సినిమా కూడా తెరకెక్కించాడు. నిజానికి ఆ తర్వాత భాగ్యరాజాకు అండగా నిలిచింది కూడా కుమార్తె శరణ్యనే. ఈ విషయాలు తెలిసిన ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ లేఖపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భాగ్యరాజా లెటర్ హెడ్‌ను తీసుకుని, తమకు అనుకూలమైన రాతలు రాసి ఈ లేఖను సృష్టించారని అంటుంటే... మరికొందరు ఇది ఏ.ఐ. లేఖ అని తేల్చి పారేస్తున్నారు. ఇంకొందరైతే... పిల్లలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద తండ్రి సంతకాన్ని కాపీ చేసినట్టుగా శాంతను తండ్రి లెటర్ హెడ్ పై తనకు అనుకూలమైన రాతలు రాసుకున్నాడని విమర్శిస్తున్నారు. ఏదైనా... భాగ్యరాజా పేరుతో వచ్చిన ఈ లేఖలు ఊహించని వివాదాలకు తెరలేపాయి.
ఇవి కూడా చదవండి:
ఎట్టకేలకు.. విజయ్ 'జన నాయగన్' సెన్సార్ పూర్తి?
Kayadu Lohar: టెన్త్ క్లాస్‌లోనే అంత పని చేసిందా?
వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!