Arjun: మౌనాన్ని బలహీనతగా భావించొద్దు.. ఆ విషయంలో రాజీపడేది లేదు

ABN , Publish Date - Nov 21 , 2026 | 08:51 AM

తన పెద్ద కుమార్తె ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య, నిరాధార ప్రచారంపై సీనియర్‌ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన పెద్ద కుమార్తె ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య, నిరాధార ప్రచారంపై సీనియర్‌ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మౌనాన్ని బలహీనతగానో, తప్పును అంగీకరించినట్టుగానో భావించరాదని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘నా చిన్న కుమార్తె వివాహ సమయంలో పెద్ద కుమార్తె ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. అయితే, అది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయం కావడంతో, ఆమె గోప్యతను గౌరవించి ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. ప్రతి మహిళకు తన జీవితానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు, తన నిబంధనల ప్రకారం జీవించే స్వేచ్ఛ ఉంటాయి. సరైన సమయం వచ్చినప్పుడు ఆమెనే స్వయంగా మాట్లాడుతుంది.

అయితే, నా కుమార్తె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, ఆమె వ్యక్తిగత జీవితంపై అసత్యమైన, అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తుంటే తండ్రిగా చూస్తూ ఊరుకోలేను. ఒకరి వ్యక్తిత్వ హననానికి పాల్పడే హక్కు ఎవరికీ లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళను ఆల్కహాలిక్‌ అంటూ ముద్ర వేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. నేను ఎల్లప్పుడూ హుందాతనాన్ని పాటిస్తాను. ఇతరులను గౌరవిస్తాను. అయితే, మా మౌనాన్ని బలహీనతగా లేదా తప్పును అంగీకరించినట్టుగా భావించరాదు. అసత్యాలను పదేపదే ప్రచారం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోం. ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాం. కొన్ని మీడియా సంస్థలు కేవలం కంటెంట్‌ కోసం అసత్య ఆరోపణలను బ్రేకింగ్‌ న్యూస్‌లుగా మార్చడం దురదృష్టకరం. ఇలాంటి అసత్య వార్తలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తండ్రిగా నా కుమార్తె ఆత్మగౌరవానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. ఇకపై కూడా ఇలాంటి పరువు నష్టం కలిగించే ఆరోపణలను ప్రచారం చేస్తే న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటాం. ఆత్మగౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు’ అని అర్జున్‌ స్పష్టం చేశారు.


ALSO READ:

డౌట్స్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’.. త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ఎవరితో..

బాలీవుడ్‌కు ‘గరుడవేగ’ అంజి.. ‘అన్ఎక్స్‌పెక్టెడ్’

‘మాతృభూమి’ కోసం సల్మాన్, చిత్రాంగద హైదరాబాద్‌లో సందడి

Updated Date - Nov 21 , 2026 | 09:09 AM