సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?

ABN, Publish Date - Nov 26 , 2026 | 06:02 AM

కావ్యా మారన్, అనిరుధ్ రవిచంద్రన్ వివాహంతో మరోసారి ఆత్మగౌరవ వివాహం చర్చకు వచ్చింది. పెరియార్ ఆశయాలు, కుల నిర్మూలన, స్త్రీపురుష సమానత్వం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై ప్రత్యేక విశ్లేషణ.

Kavya Maran

పెళ్లంటే సంప్రదాయాలు, వేదమంత్రాలు, పూజారులు, తాళిబొట్టు.. ఇవే గుర్తుకొస్తాయి. కానీ వీటికి భిన్నంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు దశాబ్దాల క్రితమే బలమైన పునాది వేశారు తమిళ సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి నాయకార్. ఆయన ప్రవచించిన ఆత్మగౌరవ వివాహం వెనుక కుల నిర్మూలన, స్త్రీపురుష సమానత్వం, సామాజిక న్యాయం వంటి గొప్ప ఆశయాలు ఉన్నాయి. తాజాగా సన్ టీవీ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ వివాహం నేపథ్యంలో మరోసారి ఈ విధానం చర్చకు వచ్చింది. అయితే వారి పెళ్లిలో కనిపించిన ఆచారాలు, ఆడంబరాలు పెరియార్ ఆశించిన ఆత్మగౌరవ వివాహ స్ఫూర్తికి అద్దం పట్టాయా? అసలు ఆత్మగౌరవ వివాహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? కాలక్రమంలో ఆ ఉద్యమం ఎలా మారిపోయింది? అనే ఈ ఆసక్తికర అంశాలపై ప్ర‌త్యేక‌ విశ్లేషణ‌.


‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?

సన్ టీవీ యజమాని కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్ (Kavya Maran) , సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ( Anirudh Ravichander) ఇటీవల వివాహబంధంతో ఒకటయ్యారు. సామాజిక మాధ్యమాల జోరు పెరిగిన ఈ కాలంలో ఆ పెళ్లి ఎలా జరిగిందన్నదానితో పాటు పెరియార్ ప్రభోదించిన ఆత్మగౌరవ వివాహం (తమిళంలో 'స్వీయ మరియాద తిరుమనం") అంశం (Self Respect Marriage) కూడా చర్చకు వచ్చింది. వేదమంత్రోచ్ఛరణ జరగకుండా, బ్రహ్మణ పూజారి ప్రమేయం లేకుండా, ఏడడుగులు వేయకుండా పూలదండలు మార్చుకుని, ఒకరి మెడలో ఒకరు బంగారు గొలుసులు వేసుకుని కావ్యా, అనిరుధ్ వివాహం చేసుకున్నారు. వారిది ఆత్మగౌరవ వివాహమేనా, పెరియార్ ప్రవచించిన విధంగానే అది జరిగిందా అన్నది చర్చ.

కళానిధి మారన్ (Kalanithi Maran) తండ్రి మురసోలి మారన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి మేనల్లుడు. సినిమాల్లో కరుణానిధి స్క్రిప్ట్, డైలాగులు రాస్తే, మురసోలి మారన్ స్క్రీన్ ప్లే చూసుకునే వారు. ఈ కుటుంబాలు పెరియార్ ఈవీ రామస్వామి నాయకార్ (Erode Venkatappa Ramasamy) అనుచరులు. ఆయన బ్రహ్మణ వ్యతిరేకోద్యమం, ఆత్మగౌరవ ఉద్యమం నడిపిన సంస్కర్త. ఆ రోజుల్లో ఏటికి ఎదురీదినట్లుగా ఆయన సామాజిక వ్యవస్థలను ప్రశ్నించి పోరాడారు. పెరియార్ సంస్కరణల్లో ఆత్మగౌరవ వివాహం ఒకటి. ఆత్మగౌరవ వివాహం అంటే ఆడ, మగ ఇద్దరూ సమానమేనని ప్రతిజ్ఞ చేయాలి. తాళి కట్టించుకోవడం అంటే మహిళలు తలవంచడమేనని పెరియార్ ప్రచారం చేశారు. మహిళలను, పురుషులతో సమానంగా చూడా లన్న ఆలోచన అందులో నిక్షిప్తమై ఉంది. ఆత్మగౌరవ వివాహంతో సామాజిక బానిసత్వం పోతుందని పెరియార్ చెబుతుండేవారు.

రుగ్వేదం 10వ మండలం 85వ సూక్తంలో 'సోమః ప్రథమో వివిదే.. అన్న శ్లోకం ప్రకారం ఒక స్త్రీ జీవితంలో పెళ్లికి ముందు ముగ్గురు అధిపతులు లేదా రక్షకులు ఉంటారు. చంద్రుడు, గంధర్వుడు, అగ్నిదేవుడు. పెళ్ళి తరువాత నాలుగో వ్యక్తి భర్త. పెరియార్ ఆ శ్లోకాన్ని ఉదహరిస్తూ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మహిళకు పెళ్లికి ముందే ముగ్గురు భర్తలు ఉంటారన్నది ఆమోద యోగ్యం కాని అంశమని, ఇదంతా బ్రాహ్మణ ఆధిపత్యం వల్ల వచ్చిందని సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ వేదికగా ప్రచారం చేశారు. 1928వ సంవత్సరం తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అరుపు. కోటై తాలూకా సుక్కిలనాథం గ్రామంలో పెరియార్ సమక్షంలోనే తొలి ఆత్మగౌరవ వివాహం జరిగింది. దానికి వ్యతిరేకంగా కొందరు కోర్టుకెక్కడం, అలాంటి పెళ్లిళ్లు చట్టప్రకారం చెల్లవని మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పడం జరిగిపోయింది.

అయినా, ఆత్మగౌరవ ఉద్యమం తారా స్థాయిలో ఉన్న కారణంగా వందలకొద్ది సెల్ఫ్ రెస్పెక్ట్ పెళ్లిళ్ల నిర్వహణ కొంతకాలం బలంగా కొనసాగింది. డీఎంకే అధికారా నికి వచ్చిన తర్వాత 1968లో ఆత్మగౌరవ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ముందుగా పెరియార్ అనుమతి కోసం డీకే ప్రస్తుత కార్యదర్శి కే.వీరమణి ద్వారా దాని ప్రతిని పెరియార్ వద్దకు పంపారు. తాళి అవసరం లేదన్నది బిల్లులో ఒక కీల కాంశమైతే పెరియార్ దానికి చిన్న సవరణ చేసి తాళి ఐచ్ఛికం అని మార్చా రని అంటారు. పెరియార్ అలా ఎందుకు చేశారో తెలియదు కానీ, ఇప్పుడు కావ్య, అనిరుధ్ వివాహంలో కూడా తాళి లాంటి ఒక గొలుసు కనిపించింది.

ఆత్మగౌరవ వివాహాల నిర్వహణ వెనుక కుల రహిత సమాజ స్థాపనే ప్రధాన ధ్యేయం. మనుషులంతా ఒక్కటే అన్నవాదనతో పెరియార్ ఈ వివాహాలను ప్రోత్సహించారు. కులానికి, పేదరికానికి లింకు ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడులో పట్టణీకరణతో పాటు, పేదరికమూ విస్తరించింది. బ్రాహ్మణ, వైశ్య వంటి సామా జికవర్గాల పరిస్థితి కాస్త దిగజారినా, మధ్యస్థ కులాలైన తేవర్లు, వన్నియార్ల సామాజిక ఆధిపత్యం విపరీతంగా పెరిగి, పేదలైన వెనుకబడిన, దళిత వర్గాలను వాళ్లు ఎదగనివ్వలేదు. అక్కడే సామాజిక సంస్కరణలకు బ్రేకులు పడ్డాయి. జనంలో పాత వాసనలు కొనసాగి మార్పు దిశగా వాళ్లు అడుగులు వేయలేక పోయారు.

కుల రహిత సమాజం కోసం పాటుపడాలన్నా, మతచాందస భావాలు పోవాలన్నా, జెండర్ జస్టిస్ జరగాలన్నా ఆత్మగౌరవ వివాహాలతోనే మొదలు కావాలని పెరియార్ భావించారు. అందుకే కులాంతర వివాహాలతో ఆత్మగౌరవాన్ని ముడిపెట్టారు. రెండు కులాలకు చెందినవారు వివాహబంధంతో ఒకటైతే సామాజిక ఆధిపత్యం పోతుందని ఆయన ఎదురుచూశారు. నిజానికి అవి ప్రేమ వివాహాలు కూడా అవుతాయి. కులవ్యవస్థ పరిధిలో, మత నియమాల ఆధారంగా జరిగే పెళ్లిళ్లు కేవలం అరేంజ్డ్ మ్యారె జెస్ గా ఉంటాయని, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లను అత్యంత ఆడంబరంగా నిర్వహి స్తారని, అందులో సంపదకు ప్రాధాన్యం ఉంటుందని పెరియార్ గుర్తించారు.

ఆత్మగౌరవ వివాహంలో సంపదను ప్రదర్శించే అవకాశం లేకుండా చేయాలని పెరియార్, ఆయన అనుచరులు కోరుకున్నారు. మరోపక్క హిందూ వివాహ వ్యవస్థ మొత్తం సంస్కృత భాష చుట్టూ తిరుగుతుంది కనుక, ఆత్మగౌరవ వివాహమైతే తమిళ భాష, తమిళ సంస్కృతి ప్రధా నాంశంగానే ఉంటుందని వారి నమ్మకం. పూజారి లేని ఆత్మగౌరవ పెళ్లిలో ఇద్దరు పెద్దలు తమిళంలో ప్రసంగించి సామాజిక న్యాయ సూత్రాలను ప్రచారం చేసేవారు. మరి కావ్యా, అనిరుధ్ పెళ్లిలో ఇవన్నీ జరిగాయా? అది అత్యంత ఖరీదైన పెళ్లి కూడా. కావ్య భర్త అనిరుధ్ ఏ క్యాస్ట్ అని ప్రత్యేకంగా అడగాల్సిన పని కూడా లేదు. భారతదేశానికి సుదూరంగా గ్రీస్లో జరిగిన ఈ పెళ్లికీ పెరియారూ సంబంధం ఏమిటని జనమే సరిపెట్టుకోవాలేమో! - ఏ. బొల్లంరాజు (జర్నలిస్టు)

Updated Date - Nov 26 , 2026 | 06:12 AM