ఎమ్మెల్యే పాడెమోసిన సీఎం విజయ్..
ABN, Publish Date - Nov 20 , 2026 | 09:33 PM
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కోలాత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీఎస్ బాబు (VS Babu) గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్ నుంచి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, గురువారం మధ్యాహ్నం 2:24 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కోలాత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీఎస్ బాబు (VS Babu) గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్ నుంచి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, గురువారం మధ్యాహ్నం 2:24 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం జరిగిన అంతిమ యాత్రలో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ (Vijay) స్వయంగా పాల్గొని ఇతర నేతలతో కలిసి వీఎస్ బాబు పాడె మోయడం అందరినీ కదిలించింది. ఒక సీఎం అయ్యి ఉండి కూడా విజయ్.. బాబుని తన సొంత కుటుంబ సభ్యుడిలా అనుకోని పాడెను మోయడం ఆయన మంచితనానికి నిదర్శమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
2026 ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వీఎస్ బాబు సంచలన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కీలకమైన కోలాత్తూర్ నియోజకవర్గంలో డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించి బాబు పెద్ద సంచలనమే నమోదు చేశారు. ఆ ఘనతతో రాజకీయంగా బలమైన ముద్ర వేసిన బాబు మృతితో, టీవీకే పార్టీ ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించింది. పార్టీ అధికారిక కార్యక్రమాలను రద్దు చేయడంతో పాటు, జెండాలను సగం వరకు ఎగురవేయాలని ఆదేశించింది.
పెరంబూర్‌లోని బాబు నివాసం వద్ద జనం రద్దీకి సరిపడా స్థలం లేకపోవడంతో, పార్థివ దేహాన్ని సమీపంలోని ప్రైవేట్ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఉంచి ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు. అక్కడ భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు తమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం పెరంబూర్ నుంచి పల్లవన్ సాలై స్మశానవాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో సీఎం విజయ్‌తో పాటు మంత్రులు ఆనంద్, ఆధవ్ అర్జున, వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్ తదితరులు బాబు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే కేజీ అరుణ్‌రాజ్, ఏ రాజమోహన్, ఎస్ రాజేష్ కుమార్, కనిమొళి, జయరామన్ వంటి పలువురు ప్రముఖ నేతలు హాజరై బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.