Kollywood: ఇకపై నటీనటులకు పారితోషికాల్లేవ్.. మే 2న షూటింగులు బంద్..
ABN, Publish Date - Apr 27 , 2026 | 11:44 AM
తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై నటీనటులకు రెమ్యునరేషన్ ఇవ్వకూడదని, సినిమా లాభాల్లో రెవెన్యూ షేర్ ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చింది.
తమిళ నిర్మాతల మండలి (Tamil producers Council) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై నటీనటులకు రెమ్యునరేషన్ ఇవ్వకూడదని, సినిమా లాభాల్లో రెవెన్యూ షేర్ ( Profit Sharing System) ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. మే 2న తమిళనాడులో సినిమా షూటింగ్‌ల బంద్‌కు పిలుపు నిచ్చింది. చెన్నైలో ఆదివారం జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానం చేశారు. కొద్దిరోజులుగా తమిళనాడులో నటీనటులు రెమ్యునరేషన్, ఓటీటీల గురించి తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే!
ఓటీటీ, శాటిలైట్ వ్యాపారం పతనమవుతున్న తరుణంలో టాలీవుడ్‌లో నడుస్తున్నట్లే నటీనటులకు రెవెన్యు షేర్ విధానంలో తమిళనాడు నిర్మాతలకు ప్రాధాన్యమిచ్చి సినిమాల్లో నటించాలని, నిర్మాతల లాభనష్టాల్లో పాలుపంచుకోవాలని హీరోహీరోయిన్లను, సీనియర్ సాంకేతిక నిపుణులను కోరారు. రానున్న రోజుల్లో మీడియం బడ్జెట్ చిత్రాలను రెవెన్యూ షేర్ విధానంలో మాత్రమే నిర్మించాలనే డిమాండ్‌తో ఒక రోజు నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై నడిగర్ సంఘం రియాక్ట్ కాకపోతే రిలే దీక్ష చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మే 10న జరగనున్న దక్షిణ భారత సినీ నిర్మాతల సమావేశంలో అనుకున్న తేది ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో సినిమాలను విడుదల చేయబోమనే నిర్ణయం తీసుకోనున్నారని తెలిపింది. ఆ నిర్ణయానికి సర్వసభ్య సమావేశం మద్దతు తెలుపుతుందంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కలైపులి ఎస్ ధాను, ఎల్.కె. సుదీశ్, దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.