Kollywood Bund: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాలు లేవు.. పెద్ద సమస్యే ఇది
ABN, Publish Date - Aug 22 , 2026 | 06:43 PM
తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల నిలిపివేయాలని నిర్ణయించారు.
తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల నిలిపివేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఆపేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. పరిశ్రమలో చాలాకాలంగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ విడుదలకు మధ్య ఉన్న గ్యాప్ విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. థియేటర్‌లో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల గ్యాప్ ఉండాలని వారు కోరుతున్నారు. అదే సమయంలో సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఎలా పంచుకోవాలనే అంశంపైనా చర్చ జరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నట్టే తమిళనాడులో కూడా పర్సంటేజ్, రెంటల్ విధానంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలని తమిళ నిర్మాతలు కోరుతున్నారు.
అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో నిర్మాతలు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తమిళ నిర్మాతలు ఆశించినప్పటికీ.. ఇప్పటివరకు అలాంటి పరిస్థితులు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొత్త సినిమాల విడుదలలు నిలిచిపోతే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం అమలైతే సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు భారీ, క్రేజీ సినిమాలపై ప్రభావం పడనుంది. ఇప్పటికే విడుదల తేదీలు ఖరారైన సినిమాలు వాయిదా పడే అవకాశం ఉండటంతో ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని తమిళ సినీ వర్గాలు కోరుకుంటున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పరిస్థితి ఇలాగే ఉంది.. ఇక్కడ కూడా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఓటీటీ గ్యాప్, రెంటల్, రెవెన్యూ షేరింగ్ వంటి అంశాలపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తే.. భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అదే తరహాలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.