సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మనసు మార్చుకున్న సూర్య!

ABN, Publish Date - Apr 04 , 2026 | 01:22 PM

సూర్య, ఆర్.జె. బాలాజీ సినిమా 'కరుప్పు' పేరును తెలుగులో 'వీరభద్రుడు'గా మార్చారు. ఈ సినిమా మే 14న విడుదల కాబోతోంది.

Veerabhadrudu Movie

అన్నదమ్ములైన తమిళ స్టార్ హీరోలు సూర్య (Suriya), కార్తీ (Karthi) కి తెలుగునాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు నటించిన కొన్ని సినిమాలు తమిళంలో కంటే కూడా తెలుగులో బాగా ఆడిన సందర్భాలున్నాయి. సూర్య చాలా కాలం క్రితమే రామ్‌ గోపాల్ వర్మ (Ramgopal Varma) 'రక్త చరిత్ర' సినిమాలో నటించాడు. కార్తి... నాగార్జున 'ఊపిరి' సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఆ రకంగా వీరిద్దరూ స్ట్రయిట్ తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పటి నుండి స్ట్రయిట్‌ సినిమాల్లోనూ వీరు నటించాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నానే ఉన్నారు.


అయితే కొంతకాలంగా సూర్య, కార్తీ ఇద్దరి సినిమాలు తెలుగులో పెద్దంతగా ఆడటం లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో తమిళ నేటివిటీకి తగ్గ సినిమాలు వారు చేస్తుండటం, అలానే మూస యాక్షన్ మూవీస్‌ చేయడం దీనికి ప్రధాన కారణం. ఇదిలా ఉంటే... సూర్య ప్రస్తుతం ఆర్. జె. బాలాజీ దర్శకత్వంలో 'కరుప్పు' (Karuppu) అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో రిలీజ్‌ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. దాంతో తెలుగునాట గట్టిగానే నిరసన వ్యక్తం అయ్యింది. నామవాచకంతో రూపుదిద్దుకున్న చిత్రాలను తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేయడం ఫర్వాలేదు కానీ అర్థంకాని పేర్లతో రిలీజ్‌ చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాతో కనెక్ట్ కారనే విమర్శలూ వచ్చాయి. 'కరుప్పు'ను మే 14న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.


చిత్రం ఏమంటే... నిన్నటి వరకూ ఈ సినిమా తెలుగు వర్షన్ పేరును 'కరుప్పు' గానే ప్రచారం చేసిన దర్శక నిర్మాతలు తాజాగా దీన్ని 'వీరభద్రుడు' (Veerabhadrudu) గా మార్చారు. దాంతో తెలుగు వారు హర్షం వెలిబుచ్చుతున్నారు. ఇటీవల కాలంలో పాన్‌ ఇండియా మూవీ అనే సాకుతో పరభాషా చిత్రాలను ఒకే పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. శుక్రవారం విడుదలైన తమిళ చిత్రం 'కార్మేని సెల్వం'ను అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేశారు. అలానే 10వ తేదీ రాబోతున్న మలయాళ చిత్రం 'పళ్ళి చట్టంబి'ని కూడా అదే పేరుతో తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. అదేమిటని హీరో టొవినో థామస్‌ను అడిగితే, 'బాహుబలి' (Baahubali)కి లేని సమస్య తమ సినిమా పేరుకు రావడం ఏమిటీ? అని సమాధానం చెప్పాడు. 'బాహుబలి' అనేది సంస్కృత పదం. దాని అర్థం చాలామందికి తేలికగా అర్థం అవుతుంది. కానీ 'పళ్ళి చట్టంబి' అంటే ఏమిటో తెలుగువారికి అర్థమే కాదు. వారి దృష్టిలో అదో బ్రహ్మ పదార్థం. తెలుగు ప్రేక్షకులు తమ చిత్రాలను ఆదరించాలని కోరుకునే వారు... తమకు అర్థమయ్యే పేరు పెట్టడం సబబుగా ఉంటుందన్నది తెలుగు ప్రేక్షకుల అభిమతం. ఏదేమైనా... సూర్య బృందం ఇప్పుడు మనసు మార్చుకుని 'కరుప్పు'ను తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్‌ చేయాలనుకోవడం శుభపరిణామమే!

Updated Date - Apr 04 , 2026 | 01:41 PM