సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suriya: నవ్వులు, కన్నీళ్లని లెక్కల్లో చూపించగలమా

ABN, Publish Date - Aug 16 , 2026 | 05:45 AM

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం.

''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత  బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. 

సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్‌ సర్‌ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ  అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా వేర్వేరు ప్రాంతాలు, భాషలకు చెందిన వాళ్లం. అయినప్పటికీ కలిసి ఒక మంచి సినిమా చేశాం. దాన్ని తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాపై చూపిస్తున్న ప్రేమ, గౌరవానికి మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేను. ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకులు మళ్లీ లైఫ్ ఇచ్చారని ఈ సినిమా నిరూపించింది. మా అందరికీ ఫ్యామిలీ జానర్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. ఈ సినిమా జర్నీలో త్రివిక్రమ్  ఆశీస్సులు, ప్రేమ, మద్దతు ఎంతో ఉన్నాయి.   సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో నా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను' అన్నారు. 



వెంకీ అట్లూరి మాట్లాడుతూ "ప్రస్తుతం యాక్షన్, హారర్, డార్క్ హ్యూమర్, డివోషనల్ వంటి విభిన్న జానర్ల సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అలాంటి సమయంలో నేను ఒక కుటుంబ కథను ఎంచుకున్నాను. ఈ కథపై నిర్మాత నాగవంశీ, త్రివిక్రమ్  నమ్మకం ఉంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారి మద్దతు లేకుండా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడం సాధ్యమయ్యేది కాదు. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు పెరగడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా కెరీర్‌లో ఇంత వేగంగా కలెక్షన్లు పెరగడం ఇదే తొలిసారి చూస్తున్నాను. అందరూ నా కథ, రచన, దర్శకత్వాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం సూర్యనే. ఆయన ఈ సినిమాను తన భుజాలపై మోశారు. పాత్రకు పూర్తి న్యాయం చేసి సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు' అని అన్నారు. 

Updated Date - Aug 16 , 2026 | 08:40 AM