Mansoor Ali Khan: సూర్య, కార్తి మీరు పెద్ద హీరోలు.. దయచేసి మాలాంటి నటులను కూడా బతకనివ్వండి!
ABN, Publish Date - Aug 17 , 2026 | 08:57 PM
సూర్య, కార్తి పెద్ద హీరోలని వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని, అదే సమయంలో మాలాంటి నటులను కూడా బతకనివ్వాలని ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ అన్నారు.
తమిళ చిత్ర పరిశ్రమలో సూర్య (Suriya), కార్తి (Karthi) పెద్ద హీరోలని వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని, అదే సమయంలో మాలాంటి నటులను కూడా బతకనివ్వాలని ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) అన్నారు. వన్ స్టెప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మైదీన్ దర్శకత్వంలో మేఘన ఆర్ నిర్మించిన చిత్రం 'ఆల్పాన్'.
ఉత్తర చెన్నై ప్రజల జీవనాన్ని ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో 'నిరంగల్ మూండ్రు', 'తరుణం' వంటి పలు చిత్రాల్లో నటించిన దుష్యంత్ (Dushyant) హీరోగా, 'బిగ్ బాస్' ఫేం జనని (Janani) హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. జేమ్స్ వసంత్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు ఆర్బీ ఉదయకుమార్, విక్రమన్, ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్, నిర్మాత ధనుంజయన్‌తో సహా చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొని ఆడియో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా.. మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ, 'కరుప్పు' చిత్రం క్లైమాక్స్‌లో నేను డ్యాన్స్ చేశాను. కానీ, దాన్ని ఎడిటింగ్‌లో తీసేశారు. ఆ తర్వాత యూట్యూబ్‌లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ చేయలేదు. సూర్య, కార్తి పెద్ద నటులు. వారు చల్లగా ఉండాలి. అలాగే, మాలాంటి నటులు కూడా బ్రతకనివ్వాలి' అని కోరారు.
చిత్ర దర్శకుడు మైదీన్ మాట్లాడుతూ, 'సినిమా రంగంలో సహాయ దర్శకులకు గుర్తింపు లేకపోవడం బాధగా ఉంది. వారికి అవకాశం వచ్చిన పుడు వారి ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కానీ, ఎంతోమంది ప్రతిభ కలిగిన సహాయ దర్శకులకు ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. పారితోషికం గురించి మాట్లాడకుండా కేవలం స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు పనిచేసేందుకు ముందుకు వచ్చిన జయప్రకాష్, సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్‌కు ధన్యవాదాలు తెలిపారు.