Suriya: కోలీవుడ్‌లో నంబర్ వన్ టార్గెట్.. స్పీడ్ పెంచిన సూర్య!
ABN, Publish Date - Jul 31 , 2026 | 12:11 PM
ఒకప్పుడు మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చాలా ఈజీగా పూర్తి చేసేవారు. కానీ, ఈ పాన్ ఇండియా జమానాలో సీన్ పూర్తిగా మారిపోయింది.
ఒకప్పుడు మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చాలా ఈజీగా పూర్తి చేసేవారు. కానీ, ఈ పాన్ ఇండియా జమానాలో సీన్ పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకి రెండేళ్లు.. ముచ్చటగా మూడేళ్లు కేటాయించడం సాధారణంగా మారిపోయింది. ఏడాదికి ఒక్క సినిమా రావడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. గతేడాది ఏకంగా ఆరు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మోహన్ లాల్, ఈ ఏడాది కూడా ఆల్రెడీ రెండు సినిమాలు రిలీజ్ చేసి.. మరో మూడింటిని లైన్లో పెట్టేశారు. ఇప్పుడు సరిగ్గా ఇదే స్పీడ్ మంత్ర ను రీసెంట్‌గా ఫాలో అవుతున్నారు తమిళ స్టార్ హీరో సూర్య.
ఈ ఏడాది ఇప్పటికే కరుప్పు సినిమాతో గ్రాండ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు సూర్య. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సూర్య కెరీర్‌కు మరింత బూస్టప్‌ను ఇచ్చింది. కరుప్పు విజయం, కలెక్షన్స్ సూర్య ఎనర్జీని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయనే చెప్పాలి. ఇదే జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది మరో రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నారు. అందులో మొదటిది విశ్వనాథ్ అండ్ సన్స్. సార్ సినిమాతో తెలుగు, తమిళ బాషల్లో భారీ బ్లాక్‌బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్య సరసన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. పక్కా ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఆగష్టు 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, అలాగే మ్యూజికల్ ట్రాక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ థియేటర్లలో ఉన్న వేడి తగ్గకముందే.. సూర్య నుండి మరొక సర్‌ప్రైజ్ వచ్చేస్తోంది. అదే సూర్య 47. ఆవేశం సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సూర్య జోడీగా నజ్రియా నటిస్తోంది.
పూర్తిస్థాయి యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాబోయే దీపావళి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఒకే ఏడాదిలో మూడు విభిన్నమైన జోనర్ల సినిమాలతో రావడం అంటే సూర్య హార్డ్ వర్క్‌కి, ప్లానింగ్‌కి హాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో మారుతున్న పరిణామాలు గమనిస్తే సూర్యకు ఒక అరుదైన అవకాశం దొరికిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోలీవుడ్‌లో టాప్ రేసులో ఉన్న దళపతి విజయ్ ఇప్పటికే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. మరోవైపు మిస్టర్ పర్‌ఫెక్ట్ అజిత్ కుమార్ సినిమాల కంటే తన డ్రీమ్ అయిన మోటార్ రేసింగ్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ సరికొత్త సమీకరణాల వల్ల తమిళ ఇండస్ట్రీలో నంబర్ వన్ స్టార్‌గా, నెక్స్ట్ బిగ్ మార్కెట్ కింగ్‌గా ఎదిగేందుకు సూర్యకు అన్ని ద్వారాలూ తెరుచుకున్నాయి. తన కంటెంట్ ఎంపిక, వెరైటీ రోల్స్ చేసే సత్తా సూర్యను ఎప్పుడూ రేసులో ముందుంచుతాయి.