Karthi: అన్నయ్య మాత్రమే చేయగల పాత్ర!
ABN, Publish Date - May 12 , 2026 | 10:24 AM
సూర్య, త్రిష జంటగా నటించిన 'వీరభద్రుడు' సినిమా మే 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అన్నదమ్ములు సూర్య, కార్తీ ఇద్దరూ దీని ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.
సూర్య (Suria) మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు'. త్రిష (Trisha) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ (R.J. Balaji) దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మించింది. ఈ సినిమా మే 14న తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో కార్తి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సుప్రియా యార్లగడ్డ (Supriya Yarlagadda) పాల్గొన్నారు.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ, 'నాకు తెలుగు అంత బాగా రాకపోవచ్చు… కానీ తెలుగు వారి మనసు మాత్రం నాకు బాగా తెలుసు. సుప్రియ గారితో మాకు ఎప్పటినుంచో చాలా మంచి స్నేహం ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాం. రాకేందు మౌళి గారు చాలా చక్కని మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి గారికి, శ్యామ్ గారికి థ్యాంక్యూ. చాలా మంచి పాటలు రాశారు. వాటికి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ఆర్.జే. బాలాజీ గారి జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన మల్టీ టాలెంటెడ్. ఈ కథను చాలా సిన్సియర్‌గా రాశారు. అంతే సిన్సియర్‌గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ చాలా మంచి ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయి థియేటర్ మాస్ మసాలా మూమెంట్స్‌తో ఉంటుంది. చాలా మంచి హ్యూమర్, ఫన్ ఉంటాయి ఇది నా ప్రామిస్' అని అన్నారు.
హీరో కార్తీ మాట్లాడుతూ, 'ఈ మూవీ ట్రైలర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. గజని డేస్ గుర్తుకు వచ్చాయి. ఇలాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు. ఆ మాస్ ఆయనకే సాధ్యపడుతుంది. నేను తప్పకుండా తెలుగు వెర్షన్ కూడా చూస్తాను. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే వెంకీతో చేస్తున్న సినిమా కూడా మీ అందరి ప్రేమను అందుకోవాలని ఆశిస్తున్నాను' అని అన్నారు.
డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ, 'ఒక డివైన్ ఎలిమెంట్‌తో పాటు సోషల్ యాంగిల్‌ను అద్భుతంగా మిక్స్ చేసి ఆర్.జే. బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని చోట్ల పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్య గారిని, కార్తి గారిని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. వాళ్ల సినిమాలు తమిళంలో రిలీజ్ అయితే ఎంత పండగలా ఉంటుందో, తెలుగులో కూడా అంతే పండగ వాతావరణం ఉంటుంది. సూర్య గారు ఎంతో హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో దాదాపు 90 రోజులు పని చేసే అవకాశం వచ్చింది. ఆయన చేసే సమాజ సేవ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా గొప్ప విజయాలు సాధించి, అద్భుతాలు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
డైరెక్టర్ ఆర్.జే. బాలాజీ మాట్లాడుతూ, 'సూర్య గారి సినిమాలను తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ సినిమాను కూడా అన్ని భాషల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అద్భుతంగా తీర్చిదిద్దాం. దర్శకుడిగా నేను సూర్య గారితో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఏముంటుందో ట్రైలర్‌లో కొంత మాత్రమే చూపించాం. సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ మాస్ మసాలా ఫిల్మ్. అభిమానులు చూడాలనుకునే సూర్య సార్‌ను ఈ సినిమాలో చూపించాం. సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమాతో సూర్య గారికి ఒక బ్లాక్‌బస్టర్ ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఖచ్చితంగా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది. ఇది ఒక ఇంటెలిజెంట్ కమర్షియల్ ఫిల్మ్. సాయి అభ్యంకర్ చాలా మంచి సంగీతం అందించారు' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, రచయిత రాకేందు మౌళి, ఫైట్ మాస్టర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.