Kollywood: కోలీవుడ్.. వేసవి వినోదమే లేదు.. కారణాలు ఎన్నో..
ABN, Publish Date - May 09 , 2026 | 09:45 AM
సాధారణంగా ప్రతి యేటా వేసవి సెలవుల్లో థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతుంటాయి. కానీ, ఈ యేడాది సందడి మచ్చుకైనా కనిపించడం లేదు
సాధారణంగా ప్రతి యేటా వేసవి సెలవుల్లో థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతుంటాయి. కానీ, ఈ యేడాది సందడి మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. గత నెల 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాని కారణంగా అనేక మంది నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేయలేదు. అలాగే, తమిళ నూతన సంవత్సరాదికి కూడా స్టార్ హీరోల చిత్రాలు ఏవీ విడుదల కాలేదు. ఏప్రిల్ మూడో వారంలో ఆర్య, గౌతమ్ రామ్ కార్తిక్ నటించిన ‘మిస్టర్ ఎక్స్’ విడుదల కాగా మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఏప్రిల్ 30న ధనుష్ ‘కర’ చిత్రం విడుదలై పరాయజయాన్ని మూటగట్టుకుంది.
ఈ రెండు చిత్రాలు మినహా.. ఇతర చిత్రాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో అనేక థియేటర్లలో షోలు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. మే నెల మొదటి వారంలో కేవలం ఒకే ఒక్క చిత్రం ‘29’ విడుదలైంది. మే 14న సూర్య ‘కరుప్పు’ విడుదల కావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం, కరుప్పు కరుప్పు కూడా వాయిదా పడే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే, వేసవి సెలవులను ప్రేక్షకులు సద్వినియోగం చేసుకుని, థియేటర్లకు వస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. ఎన్నికల కారణంగా ఈ యేడాది వేసవి సెలవులను కోలీవుడ్ చిత్రపరిశ్రమ పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.