సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తమిళ దర్శకుడిపై తెలుగు నిర్మాత ఫిర్యాదు... చేతులు మారుతున్న ప్రాజెక్ట్‌!

ABN, Publish Date - Apr 14 , 2026 | 04:18 PM

నానితో సినిమా చేయాలనుకున్న శ్రీనివాస చిట్టూరి ఆ ప్రాజెక్ట్ ను హై-బడ్జెట్‌ కారణంగా పక్కన పెట్టేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను ఖర్చు పెట్టిన రూ. 5 కోట్లను దర్శకుడు శిబి చక్రవర్తి నుండి ఇప్పించాల్సిందిగా తమిళ నిర్మాతల మండలిని శ్రీనివాస చిట్టూరి కోరుతున్నట్టు తెలుస్తోంది.

Nani

కొంతకాలం క్రితం నేచురల్‌ స్టార్ నాని (Nani) హీరోగా శ్రీనివాస చిట్టూరి (Srinivasa Chitturi) ఓ సినిమాను ప్లాన్ చేశారు. దానికి తమిళ యువ దర్శకుడు సిబి చక్రవర్తి (Cibi Chakravarthy) దర్శకుడు. సిబి చెప్పిన పాయింట్‌ నచ్చి, అతన్ని శ్రీనివాస దగ్గరకు నాని పంపారు. ఆయనకూ ఈ పాయింట్‌ నచ్చింది. దాంతో స్టోరీని డెవలప్ చేయమని చెప్పారు. అందుకోసం చెన్నయ్‌లో ఆఫీస్ తీసుకుని, డైరెక్టర్‌కు కావాల్సిన మనుషుల్ని సమకూర్చారు. అయితే... ఆ టైమ్‌కు దర్శకుడు ఈ సినిమాను రెమ్యూనరేషన్స్‌తో సంబంధం లేకుండా రూ. 65 కోట్లకు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడట.


కొంతకాలానికి కథను పూర్తి స్థాయిలో తయారు చేసుకున్న శిబి చక్రవర్తి... నానికి వినిపించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశాడట. అయితే కథను పర్ ఫెక్ట్ గా తయారు చేసే క్రమంలో ఈ సినిమా బడ్జెట్‌ ఆన్ పేపర్‌ రూ. 150 కోట్లు అయినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే నిర్మాత శ్రీనివాస కంగుతిన్నారు. దీంతో నానితో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్‌ కాదని భావించి ఈ మూవీ చేయలేనని చేతులెత్తేశారు. పేపర్‌ మీద ఉండగానే సినిమా బడ్జెట్‌ రెమ్యూనరేషన్‌తో సంబంధం లేకుండా 150 కోట్లు అయితే... ఫస్ట్ కాపీ వచ్చే సరికీ ఎంతకి పెరిగిపోతుందోనని ఆయన భయపడినట్టు తెలుస్తోంది. దాంతో నానికి చెప్పి... ఈ ప్రాజెక్ట్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే... ఇది జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్ పై తాను ఖర్చు పెట్టిన రూ. 5 కోట్ల రూపాయలను దర్శకుడు శిబి చక్రవర్తి నుండి ఇప్పించమని కోరుతూ, తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. అయితే... దర్శకుడు శిబి నిర్మాత తనకు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇవ్వడానికి సిద్థపడ్డాడట. శిబి చక్రవర్తికే కాకుండా రెండేళ్ళ పాటు ఆఫీస్‌ మెయిన్ టెనెన్స్‌కు, స్టాఫ్‌ జీతాలకు భారీగా ఖర్చయ్యిందని, దానిని ఎవరు ఇస్తారని శ్రీనివాస చిట్టూరి ప్రశ్నిస్తున్నారట.


కొసమెరుపు ఏమిటంటే... దర్శక నిర్మాతల మధ్య ఈ రచ్చ ఇలా సాగుతుండగానే.. శిబి స్క్రిప్ట్ బాగా నచ్చిన నాని... వేరే నిర్మాతకైనా ఈ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. మొత్తం మీద బడ్జెట్‌ తడిసి మోపెడు అవుతుందని తెలిసినా... మన హీరోలు అందుకు వెనకాడకుండా ధైర్యంగా ముందుకే పోతున్నారని అర్థమౌతోంది.

Updated Date - Apr 14 , 2026 | 04:20 PM